Tollywood Deepavali 2024 Movies :టాలీవుడ్లో పండగలకు, వేసవి సెలవులకు సినిమాలు ఎక్కువ విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది వేసవి బాక్సాఫీస్ చప్పగానే సాగింది. డిజే టిల్లు స్క్వేర్ సూపర్ హిట్‌తో టాలీవుడ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వేసవి కానుకగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ పెట్టిన బడ్జెట్ కలెక్షన్స్ కూడా సాధించలేక చతికిలపడింది. ఇక ప్రభాస్ కల్కి కూడా ఎన్నికల దెబ్బ పడేలా ఉందని విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ దేవర కూడా సమ్మర్ నుంచి దసరా పండగకు వాయిదా పడింది. ఇక టాలీవుడ్ భారీ హిట్ కోసం మళ్లీ పండగ సీజన్ వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- కంగువ: సూర్య సినిమా అంటే తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తారు. తమిళంలో ఉన్నంతగానే తెలుగులోనూ సూర్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కంగువ. ఈ సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ఈ సినిమా మీద ఆసక్తి పెరిగేలా చేసింది. ఈ చిత్రంతో దిశా పటాని కోలీవుడ్‌కు పరిచయమవ్వనుంది. యానిమల్తో విలన్‌గా మెప్పించిన బాబీ దేఓల్ ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ దీపావళికి విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
- గేమ్ ఛేంజర్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలోని ఓ పాటను కూడా విడుదల చేశారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
- వెట్టయాన్ : దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్న హీరో మరో గ్లోబల్ స్టార్ రజనీకాంత్. జైలర్ సక్సెస్‌తో ఉత్సాహంగా ఉన్న రజనీ జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితీకా సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
- సింగం ఎగైన్ : బాలీవుడ్‌లోనూ దీపావళికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా ఈ సారి సింగం ఫ్రాంచైజీ నుంచి సింగం ఎగైన్ సినిమా వస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకోణ్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యాస్టింగ్ తో దీపావళికి భారీగా విడుదల కానుంది ఈ చిత్రం.
- భూల్ భులయ్యా :అక్షయ్ కుమార్‌కు మంచి గుర్తింపుని ఇచ్చిన భూల్ భులయ్యా ఫ్రాంచైజీ కార్తీక్ ఆర్యన్‌కు కూడా మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి ఈ దీపావళి కానుకగా విడుదల కానుంది భూల్ భులయ్యా 3. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్‌తో పాటు త్రిప్తి దామ్రీ, విద్యా బాలన్, మాధురి దీక్షిత్ నటించారు.