The Most Expensive Movie Scene In Cinema History : భారత చిత్ర పరిశ్రమలో 'కల్కి 2898 ఏడీ', 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి', 'జవాన్' లాంటి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ఇటీవల కాలంలో తెరకెక్కాయి. అయితే ఈ భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలకు సాధ్యం కాని ఓ ఘనతను త్వరలో బాలీవుడ్‌లో రాబోతున్న ఓ మూవీ సొంతం చేసుకోనుంది. ఆ మూవీలో ఒకే ఒక్క సీన్ తీయడానికి మేకర్స్ ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు చేస్తుండటం విశేషం. ఆ సినిమా ఏది? అందులో ఎవరు నటించారు? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూవీ క్లైమాక్స్ సీన్ కోసం రూ.25 కోట్లు ఖర్చు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సింగం అగైన్'. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ మూవీలో కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే రూ.25 కోట్లు ఖర్చు చేశారన్న వార్త సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ఈ సన్నివేశాన్ని హైదరాబాద్ లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆ లెక్కన మొత్తం బడ్జెట్ లో 10 శాతం కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే ఖర్చు చేస్తుండటం విశేషం.
అగ్ర హీరోలతో క్లైమాక్స్!
'సింగం అగైన్'లో డీసీపీ బాజీరావ్ సింగంగా అజయ్ దేవగణ్, ఏసీపీ సింబాగా రణ్‌వీర్ సింగ్, డీసీపీ వీర్ సూర్యవర్షీగా అక్షయ్ కుమార్, ఏసీపీ సత్యగా టైగర్ ష్రాఫ్, ఏసీపీ శక్తి శెట్టిగా దీపిక, ఏసీపీ అవనీ కామత్ సింగంగా కరీనా కపూర్ నటిస్తున్నారు. ఇక వీళ్లందరినీ ఎదుర్కొనే ఏకైక విలన్ దంగర్ లంకగా అర్జున్ కపూర్ కనిపించబోతున్నారు. వీరి మధ్య జరిగే క్లైమాక్స్ సీన్ కోసమే మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారట. కాగా, ప్రపంచ సినీ చరిత్రలో 1967 క్లాసిక్, వార్ అండ్ పీస్ మూవీలో ఓ సీన్ కోసం ఎక్కువ ఖర్చు చేశారు. దాదాపు 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారట. అంటే ఇండియా కరెన్సీలో రూ.839 కోట్లు అన్నమాట.
నవంబరు 1న రిలీజ్
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రియేట్ చేసిన పోలీస్ యూనివర్స్‌లో ఈ సింగం అగైన్ ఐదో సినిమాగా రానుంది. ఈ సినిమా నవంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సింగం సీక్వెల్', భారీ తారాగణం ఉండటం వల్ల ఈ సినిమాపై బాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ నాడే కార్తిక్ ఆర్యన్, విద్యాబాలన్, ట్రిప్తి దిమ్రి, మాధురి దీక్షిత్ తారగణంగా తెరకెక్కిన 'భూల్ భులయ్యా 3' కూడా థియేటర్లలో సందడి చేయనుంది.