Naga Chaitanya 2024 Indian Racing League :అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. ఈ జర్నీలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో పోటీ పడబోతున్నాడు! సినిమా, క్రికెట్లో కాదు రేసింగ్‌లో. ఎందుకంటే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ అనే రేసింగ్ టీమ్‌ను చైతూ కొనుగోలు చేశారు. దీంతో ఆయన రేసింగ్ టీమ్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీ పడనుంది. ఈ ఐఆర్ఎఫ్ ఫార్ములా 4 రేసింగ్‌లు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
మొత్తం ఆరు టీమ్స్ -ఈ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ మొత్తం ఆరు టీమ్స్ పోటీ పడతాయి. నాగ చైతన్య హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌తో పాటు కోల్‌కతా రాయల్ టైగర్స్, చెన్నై టర్బో రైడర్స్, స్పీడ్ డెమోస్ దిల్లీ, గోవా ఏసెస్ జేఏ, బెంగళూరు స్పీడ్‌స్టర్స్ ఈ రేసింగ్ బరిలో దిగనున్నాయి. వీటిలో కోల్‌కతా రాయల్ టైగర్స్ జట్టుకు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ యజమానిగా వ్యవహరిస్తున్నారు. గోవా ఏసెస్ టీమ్‌ను జాన్ అబ్రహమ్, స్పీడ్ డెమోస్ దిల్లీ టీమ్‌ను అర్జున్ కపూర్ ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరిచిపోలేని అనుభూతి - నాగ చైతన్యకు రేసింగ్‌లంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆయన రేసింగ్ బైక్‌లు, కార్లు నడుపుతోన్న ఫొటోలు, వీడియోలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. అయితే నాగ చైతన్య తాజాగా ఈ రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేయడంపై మాట్లాడుతూ "నేను చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్‌ను ఎంతో ఇష్టపడతాను. ఫార్మాలా వన్ అంటే చాలా ఇష్టం. ఈ రేసింగ్‌లోని హైస్పీడ్ డ్రామా, కార్లు, బైక్స్ నన్నెంతగానో ఆకట్టుకుంటాయి. ఐఆర్ఎఫ్ అనేది అభిమానులకు మరిచిపోలేని అనుభూతి. ఈ రేస్‌తో కొత్త ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతుంది" అని అన్నారు.