Sree Vishnu Swag Movie :వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో శ్రీవిష్ణు. ఆయన చిత్రాలు కొత్తదనంతో పాటు పసందైన వినోదాన్ని నింపుకుని అందర్నీ అలరిస్తుంటాయి. 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' విజయాల తర్వాత ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం 'శ్వాగ్'. 'రాజ రాజ చోర' విజయం తర్వాత విష్ణుతో హసిత్ గోలి చేసిన రెండో సినిమా ఇది. అక్టోబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన 'శ్వాగ్' మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీవిష్ణు తనదైన శైలిలో ట్రైలర్‌ను రక్తికట్టించారు. '1551 నుంచి మగవాడి ప్రయాణం' అంటూ మొదలైన ట్రైలర్ నవ్వులు పంచుతూనే ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీవిష్ణు ఇందులో నాలుగు తరాలకు చెందిన వాడిగా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అంతలా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. అయితే 'శ్వాగ్' మూవీకి 'రాజ రాజ చోర' సినిమాకు కనెక్షన్ ఉందంటూ వార్తలు వచ్చాయి. వాటిపై హీరో శ్రీవిష్ణు ఏమన్నారంటే?
'అందుకే పక్కనపెట్టేశాం'
'రాజ రాజ చోర', 'శ్వాగ్' కథకు స్క్రిప్ట్ దశలో కనెక్షన్ ఉండేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు శ్రీవిష్ణు. అయితే 'శ్వాగ్' కథలో ఉన్న లోతు, స్క్రిప్ట్ దృష్ట్యా దాన్ని పక్కనపెట్టేశామని పేర్కొన్నారు. 'రాజరాజ చోర', 'శ్వాగ్' చిత్రాల మధ్య లింక్ ఎంటర్టైన్మెంట్ పార్ట్‌లో ఉండేదని, కానీ 'శ్వాగ్' కథాంశం దృష్ట్యా దాన్ని విరమించుకున్నామని వెల్లడించారు. 'శ్వాగ్'లో నాలుగు పాత్రలో నటిస్తున్నానని వివరించారు. ఇందులో ప్రతి పాత్రకు రెండున్నర గంటల ప్రీక్వెల్ తీసేంత కథ ఉందని చెప్పారు.