Socio Fantasy Upcoming Movies Telugu: తెలుగు సినిమా పరిశ్రమకు అద్భుతరసం (నవరాసాల్లో ఇది ఒకటి) అనేది కొత్తదేమీ కాదు. 'కీలుగుర్రం', 'పాతాళ భైరవి' కాలం నుంచి మొదలుపెడితే, మొన్నటి 'బాహుబలి' వరకు తెలుగు సినిమాల్లో ఈ అద్భుత రసం కొనసాగుతూనే ఉంది. గతంలో 'చందమామ' బాలమిత్ర కథలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆయా పాత్రలు తెరమీద కనిపిస్తూ ఉంటే తెగ ఎంజాయ్ చేసేవారు. కాంతారావు లాంటి హీరోలు జానపద చిత్రాలకే పరిమితమై ప్రేక్షకులను ఊహలోకాల్లోకి తీసుకెళ్లేవారు. 'ఎన్టీ రామారావు', 'ఏఎన్ఆర్', 'కాంతారావు', 'సూపర్ స్టార్ కృష్ణ', 'చిరంజీవి' సహా అందరు ఈ తరహా చిత్రాల్లో నటించి తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచారు.
అయితే ఎప్పుడైతే కుటుంబ కథా చిత్రాలు, మాస్ చిత్రాలు హిట్ అవ్వడం మొదలయ్యాయో, జానపద, అద్భుతరస చిత్రాలు క్రమంగా తగ్గాయి. ఆ మధ్యలో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' లాంటి సినిమాలు వచ్చినప్పటికీ, దర్శకనిర్మాతలు మళ్లీ ఆ జానర్లో వెళ్లలేదు. ఇక యమలోకాన్ని బేస్ చేసుకొని అప్పుడప్పుడు వచ్చిన సినిమాలు ఈతరం ప్రేక్షకులకు అద్భుతరసాన్ని పరిచయం చేశాయి.
బాహుబలితో ట్రెండ్ ఛేంజ్: చాలా దశాబ్దాల తర్వాత 'బాహుబలి' సినిమా మళ్లీ జానపద చిత్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పించింది. ఈ దెబ్బతో అటు తెలుగులోనే కాదు పాన్ ఇండియా మొత్తం ఈ జానర్ సినిమాలకే ఆసక్తి చూపింది. కంటెంట్ డిమాండే దీనికి ప్రధాన కారణంగా చెప్పాలి. సినిమా బడ్జెట్తో పాటు, సాంకేతిక నిర్మాణ విలువలు పెరగడం కూడా దీనికి మరో కారణంగా చెప్పవచ్చు. అటు హాలీవుడ్ లో కూడా వార్నర్ బ్రదర్స్ లాంటి సంస్థలు మార్వెల్ కామిక్స్ పేరిట అద్భుతమైనటువంటి పాత్రలను సృష్టించి సూపర్ హీరో పాత్రలకు కొత్త అర్థాన్ని ఇచ్చాయి.