Sobhita Dhulipala Career :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మిస్ ఇండియాతో కెరీర్ ప్రారంభించి నటిగా ఎదిగారు. ఈ క్రమంలోనే 'గూఢచారి', 'మేడ్ ఇన్ హెవెన్', 'ఘోస్ట్ స్టోరీస్', 'నైట్ మేనేజర్', 'పోన్నియన్ సెల్వన్' వంటి సినిమా/సిరీస్‌లో కీ రోల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలే కాకుండా తాజాగా హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన కెరీర్ గురించి శోభిత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
తొలిసారి చదివిన పుస్తకం
నేను పుట్టింది తెనాలిలో. నాన్న నేవీ ఇంజినీర్‌గా వైజాగ్‌లో పనిచేసేవారు. దీంతో నేనూ అక్కడే పెరిగా. అమ్మ టీచర్. ఇంట్లో కేబుల్ కనెక్ష్షన్‌కు బదులు లైబ్రరీ ఉండేది. చదవడాన్ని హాబీగా మార్చుకున్న నేను ఊహ తెలిశాక 'బుడుగు' అనే పుస్తకం చదివాను. వైజాగ్‌లో ఇంటర్ అయ్యాక ముంబయి వచ్చి డిగ్రీలో చేరా. అప్పుడు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ చేయాలని ప్రయత్నించాను. ఈ క్రమంలో రంగు గురించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. మోడల్‌గా ఆడిషన్స్‌కు వెళ్లే క్రమంలో ఎదురైన కొన్ని సంఘటనలు ఎంతో బాధపెట్టాయి. కానీ అవే తెలియకుండా నాలో పట్టుదలనీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి.
తొలి ఛాన్స్
రోజూ నాతో మాట్లాడే నా స్నేహితులు కొందరు 'నీ వాయిస్ బాగుంది' అనేవారు. ఆ మాటలు నాలో ఉత్సాహాన్ని నింపడంతో ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. దాదాపు వంద ఆడిషన్లకు హాజరైయ్యా. అలా ఒకసారి నాకు 2016లో అనురాగ్ కశ్యప్ 'రామన్ రాఘవ్ 2.0'లో అవకాశం వచ్చింది. అంతేకాదు ఒకప్పుడు నన్ను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీ ఐశ్వర్యరాయ్ పక్కన యాడ్‌లో నటించాలనడంతోపాటు, వాళ్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని అడిగారు.
హాలీవుడ్ సినిమా
'గూఢచారి', 'మేడ్ ఇన్ హెవెన్', 'ఘోస్ట్ స్టోరీస్', 'నైట్ మేనేజర్', 'పోన్నియన్ సెల్వన్' వంటి సినిమాలు నాకు మంచి గుర్తింపును ఇచ్చాయి. ఈ మధ్య 'మంకీ మ్యాన్'అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించా. ఇక 'కల్కి'లో దీపిక పదుకొణెకి డబ్బింగ్ నేనే చెప్పాను. అది ఓ ప్రత్యేక అనుభూతి.