Senior Actress Krishnaveni Passed Away :ఎన్టీఆర్, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి లీలా వంటి ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.
కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్, ఘంటసాల, గాయని పి.లీలా వంటి ప్రముఖులను 'మనదేశం'తో ఆమె తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమాకు ఓ వైపు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే ఎన్టీఆర్‌కు జంటగా అందులో నటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వైద్యుడిగా పనిచేశారు. కృష్ణవేణి డ్రామా ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 1936లో విడుదలైన 'సతీ అనసూయ'తో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. 1939లో మీర్జాపురం జమీందార్‌తో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ సారథ్యంలో పలు సినిమాలకు కృష్ణవేణి నిర్మాతగా వ్యవహరించారు. 'దక్షయజ్ఞం', 'జీవన జ్యోతి', 'భీష్మ', 'గొల్లభామ', 'ఆహుతి' వంటి చిత్రాల్లో ఆమె నటించారు.