Prakash Raj Birthday Special :కొందరు నటులకు కొన్ని పాత్రలు సరిగ్గా సరిపోతాయి. అయితే ఎలాంటి పాత్రనైనా చేయగలిగే నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ముందు వరుసలో ఉంటారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు. హీరోగా, నటుడిగా, ప్రతినాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. అందుకే ఆయన్ను అందరూ విలక్షణ నటుడు అంటారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
- ప్రకాశ్ రాజ్ కర్ణాటకలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో 1965, మార్చి 26న జన్మించారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. దాదాపు రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారని సమాచారం.
- స్టేజ్ ప్రదర్శన చేసేటప్పుడు నెలకు రూ. 300 వరకు పారితోషికం తీసుకున్నారట.
- కన్నడ చిత్రాలతో సినీ కెరీర్ ప్రారంభించి 1994లో కె. బాలచందర్ దర్శకత్వంలో డ్యూయెట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు.
- దీంతో తన సొంత నిర్మాణ సంస్థకు డ్యూయెట్ మూవీస్ అనే పేరు కూడా పెట్టుకున్నారు.
- మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఇద్దరు(1998) ప్రకాశ్ రాజ్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో తన నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా తొలిసారిగా నేషనల్ ఫిలిం అవార్డ్‌ను దక్కించుకున్నారు.
- 1995లో సంకల్పం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 400కుపైగా సినిమాల వరకు చేశారట.
- ఇద్దరు, సుస్వాగతం, చూడాలని ఉంది, నువ్వు నాకు నచ్చావ్, బద్రి, అంతఃపురం, ఇడియట్, ఒక్కడు, దిల్, ఖడ్గం, ఠాగూర్, ఆజాద్, పోకిరి, అతడు, బొమ్మరిల్లు, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, గూఢచారి, రంగస్థలం,సరిలేరు నీకెవ్వరు, ఇలా చాలా సినిమాల్లో ప్రకాశ్ రాజ్ పోషించిన పాత్రలను ఎవరూ మర్చిపోలేరు.
- నాను నాన్న కనసు, ఉలవచారు బిర్యానీ, మన ఊరి రామాయణం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. దయతో పాటు పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
- ప్రకాశ్ రాజ్ రెమ్యునరేషన్ విషయానికొస్తే దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి వార్తలు బయటకు రాలేదు. ఓ సందర్భంలో స్వయంగా ఆయన్నే అడిగితే తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు.
- ప్రకాశ్ రాజ్ మొదటి భార్య నటి డిస్కో శాంతికి సోదరి. వీరికి ముగ్గురు సంతానం. అనంతరం విడాకులు తీసుకున్నారు. అనంతరం 2010 ఆగస్టులో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
- సామాజిక సేవల్లోనూ ప్రకాశ్ రాజ్ ముందుంటారు.