Rishab Shetty Chhatrapati Shivaji Movie :కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్'లో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానుల కోసం షేర్ చేసుకున్నారు. అయితే తాజాగా దీని గురించి ఓ ఆంగ్ల మీడియాతో రిషబ్ మాట్లాడారు. ఇటువంటి సినిమాలో నటిస్తున్నందుకు ఆయనకు గర్వంగా ఉందని అన్నారు.
"ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించే అవకాశం రావడం నాకు దక్కిన ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఆయనకు నేను అభిమానిని. ఇటువంటి బయోపిక్‌లు చేసే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. ఆయన పాత్రకు ప్రాణం పోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. శివాజీ చరిత్రను నేటి తరానికి చెప్పడానికి నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసమే కాదు శివాజీ గురించి ఇప్పటివరకు తెలియని కథలను కూడా తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉండండి" అని ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్'ను హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో సందీప్ సింగ్ తెరకెక్కించనున్నారు. ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఓ యోధుడి కథ అంటూ డైరెక్టర్ గతంలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.