Kalki 2898 AD Tickets:పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 AD' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సత్త చాటుతూ దూసుకుపోతుంది. జూన్ 27న రిలీజైన ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో వచ్చే ఏడాది నాటికి కల్కి సీక్వెల్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వరుసగా మూడోరోజు హౌస్ఫుల్ షోస్తో రన్ అవుతూ, నయా రికార్డులు లిఖిస్తుంది. ఈ క్రమంలో కల్కి మరో రికార్డు కొట్టింది.
గురువారం రిలీజైన ఈ సినిమాకు వరుసగా మూడో రోజూ క్రేజ్ తగ్గలేదు. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో లో 24గంటల్లోనే 1.28 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయట. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకు మూడోరోజున ఇన్ని టికెట్లు అమ్ముడుపోలేదు. రోజురోజుకూ పెరుగుతున్న రెస్పాన్స్ చూసి ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఆదివారం వీకెండ్ కావడం వల్ల రెస్పాన్స్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది.
హీరోగా ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 80ఏళ్ల వయస్సులోనూ సినిమాపై ఆయన చూపించిన నిబద్ధతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనతో పాటు కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్, దిశా పటానీ తమతమ పాత్రల్లో ఒదిగిపోయి సన్నివేశాలను రసవత్తరంగా పండించారు. ముందుగా అనౌన్స్ చేయకపోయినా సినిమా రిలీజ్ అయ్యాక అందులో మృనాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండను చూపించి సర్‌ప్రైజ్ చేశారు.