Mr Bachchan Release:మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'మిస్టర్ బచ్చన్' సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. 2024 ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈమేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'గెట్ రెడీ మిస్టర్ బచ్చన్ వస్తున్నాడు. ఆగస్టు 15నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా!' అని క్యాప్షన్ రాసుకొచ్చారు. కాగా ఒకరోజు ముందే 14న సాయంత్రం నుంచే ప్రీమియర్స్ షోలు పడనున్నాయి.
డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈ సినిమాను ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ కూడా వదిలారు. ఈ గ్లింప్స్ అండ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 1 నిమిషం నిడివితో సింగిల్ డైలాగ్ లేకుండా ఫుల్ యాక్షన్ సీన్స్‌తో గ్లింప్స్ డిజైన్ చేశారు. ఇక రవితేజ ఈ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు విలన్ రోల్లో నటిస్తున్నారు.
కాగా, రవితేజ సరసన హీరోయిన్గా భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై వివేక్ కుచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు.