Rashmika Mandanna Interview :అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. 'యానిమల్' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించారు ఈ కథానాయిక. కాగా ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, విజయ్ దేవరకొండ గురించి పలు విషయాలు పంచుకున్నారు. అవేంటంటే?
'అమితాబ్ సర్ వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారు. జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని రణ్‌బీర్ ఇచ్చారు' అని రష్మిక చెప్పారు. 'నేను చేసే ప్రతి పనిలో తన సహకారం ఎప్పుడూ ఉంటుంది. అతని సలహా తీసుకుంటా. అది నాకు అవసరం. ఏది మంచో, ఏది చెడో వివరిస్తారు. అలా చెప్పడం బాగుంటుంది. వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేశారు' అని విజయ్ దేవరకొండ గురించి చెప్పుకొచ్చారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగనుందని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. హీరో విజయ్ దేవరకొండ వాటిని ఖండించారు. 'ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదు. ప్రతీ రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి. వాళ్లు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏటా ఇలాంటి రూమర్ వింటూనే ఉన్నాను' అని అన్నారు. విజయ్-రష్మిక గతంలో రెండు సినిమాల్లో (గీత గోవిందం, డియర్ కామ్రేడ్) కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విహార యాత్రలకు, పార్టీలకు వెళ్లడం వల్ల వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో చెప్పారు.