Rashmika Mandanna Adavallu Meeku Joharlu Movie : తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. 'యానిమల్' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించారు ఈ కథానాయిక. స్టార్ హీరోయిన్ వరుస చిత్రాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే "ఆడవాళ్ళు మీకు జోహార్లు' చిత్రంలో కేవలం డైరెక్టర్, హీరో కోసమే చేశాను" ఇటీవలే ఆమె చెప్పినట్లు పలు కథనాలు నెట్టింట వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మిక తాజాగా ఆ రూమర్స్‌పై స్పందించారు. ఆ రూమర్స్‌ను కొట్టిపారేశారు.
'అలా అని ఎవరు చెప్పారు? నేను కథను నమ్మి మాత్రమే సినిమాలు చేస్తాను. అలాంటి యాక్టర్లతో సినిమా చేయడం ఒక గౌరవం. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడ మొదలవుతాయో' అంటూ రష్మిక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో రష్మికకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు కూడా పుకార్లు వచ్చాయి. వాటిని సైతం నమ్మవద్దు అంటూ తెలిపారు.
గతంలో రష్మికపై పలు రూమర్స్ వచ్చాయి. ఆమెకు విజయ్ దేవరకొండ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగనుందని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. హీరో విజయ్ దేవరకొండ వాటిని ఖండించారు. 'ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదు. ప్రతీ రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి. వాళ్లు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏటా ఇలాంటి రూమర్ వింటూనే ఉన్నాను' అని అన్నారు. విజయ్-రష్మిక గతంలో రెండు సినిమాల్లో (గీత గోవిందం, డియర్ కామ్రేడ్) కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విహార యాత్రలకు, పార్టీలకు వెళ్లడం వల్ల వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో చెప్పారు.