Yash Ramayana : రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించాలనుకున్న పురాణేతిహాసం రామాయణ ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లినట్లు తెలిసింది. భారీ తారాగణంతో నిర్మించనున్న ఈ చిత్రం సుదీర్ఘ చర్చల తర్వాత ముంబయిలోని ఓ స్టూడియోలో చిత్రీకరణను ప్రారంభించుకుంది. కొద్ది రోజుల పాటు భారీ సమూహం నేపథ్యంలో సీన్స్‌ను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినిమాలో నటించే స్టార్స్ ఎవరూ రాలేదని తెలిసింది.
"నమిత్ మల్హోత్రా(నిర్మాత) తన పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించాలనుకున్నారు. అందుకే షూటింగ్‌ను ముందుగా కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో మొదలుపెట్టారు. చిన్న సీన్స్‌ను మాత్రమే తెరకెక్కించారు. యశ్ విషయానికొస్తే చాలా నెలల చర్చల తర్వాత అంగీకరించినట్లు తెలిసింది. కానీ దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అతడు రావణుడి పాత్ర పోషిస్తారు. కానీ మొదటి భాగంలో కనిపించరు. కేవలం రెండో భాగంలోనే ఆయన కనపడతారు. యశ్ తన టాక్సిక్ సినిమా షూటింగ్ పూర్తి చేశాక రామాయణంలో జాయిన్ అవుతారు. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు" అని సినిమాకు సంబంధించిన వాళ్లు చెప్పారు.
"రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ మధ్యలో నుంచి రామాయణం సెట్స్‌లోకి అడుగుపెడతారు. సాయి పల్లవి, సన్నీ దేఓల్, అరున్ గోవిల్, యశ్ తమ పాత్రల చిత్రీకరణల సమయంలో జాయిన్ అవుతారు. మొదటి భాగంలో రాముడి బాల్యం, సీత స్వయం వరం, సీతను అపహరణ వంటి చూపించనున్నారు. సీత అపహరణ సమయంలో రావణుడిగా యశ్ ముఖాన్ని రివీల్ చేయకుండానే చూపించే అవకాశముంది" అని సినిమాకు సంబంధించిన మరో వర్గం తెలిపింది.