Rana Super Plan Krishna And His Leela :ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులు అంతగా ఆదరించని సినిమాలు కూడా, రీరిలీజ్‌లో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతున్నాయి. తమ అభిమాన హీరో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు థియేటర్లలో విడుదలైన సినిమాలే మళ్లీ రిరిలీజ్ అయ్యాయి. అయితే ఓటీటీలో రిలీజైన ఓ సినిమాను థియేటర్లో రిరిలీజ్ చేసేందుకు టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా భారీ స్కెచ్ వేశారు. అది కూడా కొత్త టైటిల్‌తో. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? తదితర విషయాలు తెలుసుకుందాం.
'కృష్ణ అండ్ హిజ్ లీలా' రిలీజ్
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా చిన్న హీరోలను ప్రోత్సహించడంలో ముందుంటారు. తక్కువ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించే దర్శకుల సైతం ప్రోత్సహించి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. అలాంటి సినిమానే రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన 'కృష్ణ అండ్ హిజ్ లీలా'. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరో. కెరీర్ తొలినాళ్లలో ఆయన ఈ మూవీలో నటించారు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించగా, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ హీరోయిన్లుగా నటించారు.
కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్
విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ కరోనా కారణంగా థియేటర్లలో రిలీజ్ కాలేదు. 2020లో ఆహా వేదికగా విడుదలై యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాతో సిద్ధూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ రిలీజ్ కు రెడీ అయ్యింది. లవర్స్ డేను పురస్కరించుకొని ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. అయితే ఈసారి 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం స్పెషల్ వీడియో విడుదల చేసింది. రానా - సిద్ధూ జొన్నలగడ్డ సరదా సంభాషణతో ఈ వీడియో సినీ ప్రియులను ఆకట్టుకుంది.