Pushpa 2 Day One Collection :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప : రి రూల్' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ పెంచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ర్యాంపేజ్ సృష్టించింది. ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.175 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా. అయితే ఈ కలెక్షన్స్‌లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అమెరికాలో ఈ సినిమా ఫస్ట్ డే సుమారు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లకు పైన) కలెక్షన్ సాధించినట్లు నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా షేర్ చేసింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం 'పుష్ప 2' అనే క్యాప్షన్ దానికి జోడించింది.
గంటలోనే లక్ష టికెట్లు!
ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రీ సేల్ బుకింగ్స్ నుంచే బుక్ మై షోలో ‘పుష్ప 2’ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరోసారి హవా చూపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి. గతంలో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గంటలో 97,700 టికెట్స్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ఆ మార్క్‌ను పుష్పరాజ్ దాటేశాడు.