Prabhas Kannappa Look :మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. భారీ తారాగణంతో రూపొందుతున్న ఆ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం తాజాగా పోస్టర్ షేర్ చేసింది. రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారని చెప్పింది. "ప్రళయ కాల రుద్రుడు! త్రికాల మార్గదర్శకుడు!! శివాజ్ఞ పరిపాలకుడు!!!" అని టీమ్ పేర్కొంది. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అయితే మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌గా కన్నప్ప సినిమా సిద్ధమవుతోంది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హిందీ మహాభారత సిరీస్‌ను తెరకెక్కించిన ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు ప్రభాస్- నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపించింది. అయితే కాజల్ పార్వతీదేవిగా కనిపిస్తున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
అయితే కన్నప్ప చిత్రం అధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. అక్కడే ఈ సినిమా షూట్ చేయడానికి గల కారణాన్ని చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్ర కథ మూడో శతాబ్ద కాలం నాటిదని చెప్పింది. ఆనాటి ప్రకృతి రమణీయతను చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్‌లో చిత్రీకరణను చేపట్టామని స్పష్టం చేసింది. అలా ప్రతి సోమవారం సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ఇస్తుంది. నేడు ప్రభాస్ లుక్‌ను రివీల్ చేసింది.
నిజానికి కొద్ది రోజుల క్రితం ప్రభాస్ కళ్లను చూపించి హైప్ క్రియేట్ చేసింది కన్నప్ప టీమ్. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు ఎంతో వెయిట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. సూపర్బ్‌గా ఉందని, సినిమా కోసం వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు.