Prabhas Kalki 2898 AD event Bujji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మస్తోంది. అయితే రీసెంట్‌గానే ఈ చిత్రంలోని బుజ్జి అనే ఓ స్పెషల్ క్యారెక్టర్‌ను మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లైఫ్‌లో స్పెషల్ పర్సన్‌గా ఉన్న ఓ రొబోటిక్ కారు ఈ స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. దీనికి మహానటి కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ అందిస్తోంది. సినిమాలో ప్రభాస్‌తో పాటుగా ఈ పాత్ర కీలకంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.
దీంతో ఈ బుజ్జి ఎలా ఉంటుందా అనే ఆసక్తి, ఉత్కంఠ అందరిలో నెలకొంది. తాజాగా ఆ ఉత్కంఠతకు తెరదించుతూ బుజ్జిని ప్రపంచానికి పరిచయం చేశారు మేకర్స్. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ స్పెషల్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి అభిమానుల సమక్షంలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభాస్ వీరలెవల్లో తన బుజ్జి కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. గ్రౌండ్లో తన కారుతో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపేశారు. అనంతరం సినిమాలో బుజ్జితో కలిసి ప్రభాస్ చేసిన హాలీవుడ్ రేంజ్ యాక్షన్స్ సీక్వెన్స్ గ్లింప్స్‌ను స్క్రీనింగ్ చేశారు.
ఆ వీడియోలో "ఒక్కరోజు పాజిటివ్‌గా ఉండు బుజ్జి ప్లీజ్ అని చెబుతూ ప్రభాస్ చేసిన యాక్షన్ హంగామా మాములుగా లేదు. చివరికి "ఇక తిరిగి వెళ్లేది లేదు. లవ్ యూ బుజ్జి" అని ప్రభాస్ అనగా బుజ్జి పర్లేదులే అంటూనే గ్లింప్స్‌ను ముగించారు. మొత్తంగా ఒక్కో సీన్ హాలీవుడ్‌నే తలదన్నేలా సీన్స్‌తో చూపించారు గ్లింప్స్.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ "అన్నింటికన్నా ముఖ్యమైన విషయం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. మీరు మా సినిమాలో నటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మొత్తం ఇండియా ఈ ఇద్దరినే స్ఫూర్తిగా తీసుకుంది. మా ఫ్యామిలీ మొత్తం అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్. నార్త్ నుంచి ఇంత మంది అభిమానులను సంపాదించుకుంది ఆయనే. ఆయన సూర్తితోనే సినిమాల్లోకి వచ్చాను. అలాంటి నటుడు ఇండియాలో ఉన్నందుకు గర్వంగా ఉంది. చిన్నప్పుడు కమల్‌హాసన్ సాగర సంగమం చూసి ఆయన వేసుకున్న దుస్తులే కావాలని అడిగాను. అలాంటి బట్టలే కుట్టించుకున్నాను. ది మోస్ట్ గార్జియస్, సూపర్ స్టార్ దీపికా పదుకొణె లాంటి ఇంటర్నేషనల్ స్టార్ మా సినిమాలో నటించడం లక్కీగా భావిస్తున్నాను. దిశా కూడా హాట్ స్టార్. ఈ వయసులోనూ దత్ గారి ప్యాషన్ చూసి ఆశ్చర్యపోతున్నాను. 50ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనే. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. లవ్ యూ ఆల్" అని పేర్కొన్నారు.
కాగా, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ , లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణె లుక్స్ రిలీజ్ అయ్యాయి. మరో పాత్రలో దిశా పటాని కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తున్నారు. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. .మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో కథ సాగుతుందని మూవీటీమ్ చెబుతోంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించి సినిమాను రూపొందిస్తున్నారట. సినిమాను మేకర్స్ జూన్ 27న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.