Kalki 2898 AD Bujji And Bhairava : ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. జూన్ 27న విడుదల కానుందీ చిత్రం. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఇందులో భాగంగా సినిమాలో కీలకంగా వ్యవహించిన భైరవ(ప్రభాస్) - బుజ్జి(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ కార్) ఎలా కలిశారన్న పాయింట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఓ యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉందంటే?
కథేంటంటే ? కల్కి సినిమా జరిగే కాలానికి రెండేళ్ల ముందు అనగా 2896 ఏడీ ప్రపంచాన్ని ఇందులో చూపించారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా కార్గో వెహికల్‌లో పనిచేస్తుంటుంది ఏఐ మెషీన్ బుజ్జి. ఓ సందర్భంలో బుజ్జికి ప్రమోషన్ వస్తుంది. దీంతో కాంప్లెక్స్ మెంబర్ అయిన వ్యక్తికి ప్రైవేటు వెహికల్‌గా మారడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే చివరి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తుంది. కానీ అక్కడ రెబల్స్ అటాక్ చేసి షిప్‌ను కూల్చేస్తారు. దీంతో బుజ్జికి కాంప్లెక్స్ సిటీతో కనెక్షన్ కట్ అయిపోతుంది. బుజ్జి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. మరోవైపు కాశీ నగరంలో భైరవ(ప్రభాస్) సరదాగా తిరుగుతుంటాడు. దొంగలను, దోపిడీదారులను పట్టుకుని యూనిట్స్ (క్రిప్టో కరెన్సీలాంటిది) బాగా సంపాదించి, కాంప్లెక్స్ మెంబర్ అవ్వాలనుకుంటాడు. కానీ ఏ పని చేసినా అతడి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. పైగా ఇంటి యజమాని (బ్రహ్మానందం)కి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితులో ఉంటాడు. అయితే దొంగలను పట్టుకునే క్రమంలో ఓ బైక్ ముక్కలైపోతుంది. దాన్ని స్క్రాప్‌నకు వేసేందుకు భైవర తీసుకెళ్తాడు. అక్కడే భైరవకు బుజ్జి కనెక్ట్ అవుతుంది. దీంతో బుజ్జి ఆలోచనతో భైరవ ఓ స్పెషల్ కారును తయారు చేసేందుకు రెడీ అవుతాడు? మరి దాన్ని ఎలా తయారు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నదే కథ.