PM Modi Asks Rajini Health Update : సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంటూ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యోగక్షేమాల గురించి ప్రముఖులు, అభిమానులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన త్వరగా బాగవ్వాలని కోరుకుంటున్నారు. అయితే తాజాగా ప్రధాని మోదీ కూడా రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అక్టోబర్ 1న రజనీ సతీమణి లతతో ఆయన ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
"మన సూపర్‌స్టార్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఇటీవలె ఆరా తీశారు. రజనీ సతీమణితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు" అని తెలిపారు.
ఇదిలా ఉండగా, రజనీకాంత్ త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, స్టార్ హీరో కమల్ హాసన్ కూడా ట్విట్టర్లో పోస్ట్‌లు పెట్టారు. ఇక హీరో విజయ్ కూడా రజనీకాంత్ త్వరగా ఇంటికి తిరిగి రావాలంటూ దేవుడిని ప్రార్థించానని అన్నారు.
ఇదీ జరిగింది :
అనారోగ్యం కారణంగా రజనీ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన ఆస్పత్రిలో చేరగా, మంగళవారం సాయంత్రం చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ మెడికల్ బులెటిన్‌ను విడుదల చేశాయి. అందులో ఆయన గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడిందని, దానికి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చినట్టు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారంటూ వైద్యులు తెలిపినట్లు ఆ బులెటిన్‌లో ఉంది.