తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆస్కార్ @96 : గతేడాది 'నాటు నాటు'కు - మరి ఈ సారి కూడా భారత్​కు దక్కేనా? - Oscar 2024 awards

Oscar 96 awards : ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రపంచం 96వ అకాడమీ అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అకాడమీ అవార్డుల వేడుక మార్చి 10న మిరుమిట్లు గొలిపే వేదికపై వైభవంగా నిర్వహించనున్నారు. అయితే గతేడాది ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ కూడా పురస్కారాన్ని దక్కించుకుంది. మరి ఈసారి పరిస్థితేంటి? ఈ సారి కూడా మనకు ఏమైనా దక్కే అవకాశం ఉందా?తెలుసుకుందాం.

ఆస్కార్ @96 : గతేడాది 'నాటు నాటు'కు - మరి ఈ సారి కూడా భారత్​కు దక్కేనా?
ఆస్కార్ @96 : గతేడాది 'నాటు నాటు'కు - మరి ఈ సారి కూడా భారత్​కు దక్కేనా?

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 8:27 PM IST

Oscar 2024 awards : యావత్తు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్దిగంటల్లోనే ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం ప్రారంభం కానుంది. మార్చి 11 తెల్లవారుఝామున ఈ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం కానుంది. మొత్తం 23 విభాగాల్లో 120కిపైగా సినిమాలు డాక్యుమెంటరీలకు సంబంధించిన నామినేషన్లను ప్రకటించారు. ఓపెన్ హైమర్, దిపూర్ థింగ్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, బార్బీ సినిమాలు అత్యధిక నామినేషన్లను దక్కించుకున్నాయి. ఈ నామినేషన్ల ప్రకటనకు అమెరికా కాలిఫోర్నియాలోని శామ్యూల్ గోల్డ్ విన్ థియేటర్ వేదికగా మారింది.

అయితే గతేడాది ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలవంచక తప్పలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను ఆస్కార్ అవార్డు వరించింది. చంద్రబోస్ కలంలోని సాహిత్యం, పదునైన పదాలకు కీరవాణి చేతుల్లో నుంచి వచ్చిన సంగీతం ప్రాణం పోసింది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ఈ పాటకు ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఏకంగా ఆస్కార్ సభ్యులనే నాటు నాటు అనేలా ఊపేసిన ఈ పాట ఆస్కార్ ను కైవసం చేసుకుంది.

Oscar To kill a Tiger Documentary : అయితే ఈసారి డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ కథ టు కిల్ ఏ టైగర్ ఆస్కార్ బరిలోకి దిగింది.దిల్లీలో పుట్టి, కెనడాలో స్థిరపడ్డ నిషా పహూజా ఈ ఫిల్మ్ ను తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో టాప్ -10 విజేతగా నిలిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకుందీ డాక్యుమెంటరీ. అంతేకాదు పలు వేదికలపై 19 పురస్కారాలను కూడా కైవసం చేసుకుంది. ఝార్ఖండ్ లోని ఓ మారుమూల పల్లెలో.13ఏళ్ల ఆమ్మాయిపై లైంగిక దాడి జరుగుతుంది. తన కూతురిని కిడ్నాప్ చేసి ఆమె పై అఘాత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని రంజిత్ అనే ఓ తండ్రి జరిపిన న్యాయ పోరాటమే ఈ డాక్యుమెంటరీ నేపథ్యం. మరో నాలుగు డాక్యుమెంటరీలతో ఆస్కార్ అవార్డ్​ కోసం పోటీ పడుతోంది. గతేడాది మన దేశం నుంచి ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ ను పొందింది. మరికొద్ది గంటల్లో జరగనున్న ఆస్కార్ వేడుకలో టు కిల్ ఏ టైగర్ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విషయం అవుతుంది.

ఆస్కార్ @​96 : అవార్డు గెలిచిన భారతీయులు వీరే - తొలి వ్యక్తి ఎవరంటే?

OTTలో ప్రతిష్టాత్మక 96వ ఆస్కార్ అవార్డ్స్​ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

ABOUT THE AUTHOR

...view details