Nithya Menen About Choosing Roles : క్యూట్ లుక్స్‌తో, ఆకట్టుకునే నటనతో ఆడియెన్స్‌ను అలరిస్తోంది స్టార్ హీరోయిన్ నిత్య మేనన్. కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఆమె, ఆయా పాత్రలకు తగ్గట్లుగా మారిపోయి ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన 70వ నేషనల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా ఎంపికల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"నాకు నేషనల్ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కూడా కోరుకోలేదు. ఎందుకంటే నేను ఎంచుకున్న రంగం అలాంటిది మరి. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలని అనుకున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పటివరకూ ఆయా పాత్రలను ఎంపిక చేసుకున్నాను. భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా నేను నో చెప్పేస్తాను. అలాంటి పాత్రలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమాకైనా సరే నేను ఓకే చెప్తాను. అది ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. అందరూ అనుసరిస్తున్న మార్గంలోనే నేను కూడా వెళ్లాలన్న రూల్ లేదు కదా" అని చెప్పుకొచ్చింది.
ఇక నిత్యమేనన్కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా 'తిరు'(తిరుచిత్రంబలం). ఇందులో ధనుశ్, రాశీ ఖన్నా కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన ఈ చిత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇందులో నిత్యా మేనన్ నటనకు గతంలోనే మంచి మార్కులు పడ్డాయి.