NBK Balakrishna 50 years celebrations invitation card :టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి వచ్చే నెల(ఆగస్ట్) 30తో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఈ ఏడాది సెప్టెంబరు 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలానే ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు ఎన్‌బీకే ఫ్యాన్స్ కూడా తెలిపారు. బాలయ్య అభిమానులంతా ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా 50 రోజుల పాటు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. అయితే తాాజాగా చిత్రసీమ నిర్వహించనున్న బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వేడుకను సెప్టెంబర్ 1న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు అందులో రాసి ఉంది.
"బాలయ్య నటించిన తొలి చిత్రం తాతమ్మ కల. 1974 ఆగస్టు 30న విడుదలైంది. అప్పటి నుంచి హీరోగా విజయవంతంగా సినీ జర్నీ కొనసాగిస్తున్నారు. 1974 నుంచి 2024 వరకు 50ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతిఏడాది సినిమాలతో అలరిస్తూ బాలయ్య తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. సైడ్ రోల్స్, విలన్ రోల్స్, గెస్ట్ రోల్స్ లేకుండా హీరోగానే 109 సినిమాలు చేశారు. కెరీర్ మొత్తంలో 129 హీరోయిన్లతో పని చేశారు. భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్‌తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. ఆయన సినిమాలు రికార్డ్ స్థాయిలో 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. సోషల్, మైథాలజీ, హిస్టారికల్, ఫోక్లోర్, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్లోనూ సినిమాలు చేసి సక్సెస్‌లు సాధించారు. రాజకీయ రంగంపైనా తనదైన ముద్ర వేశారు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అలానే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గానూ సేవా రంగంపై తనదైన ముద్ర వేశారు బాలయ్య." అని ఆ ఆహ్వాన పత్రికలో రాసుకొచ్చారు.