Nandamuri Balakrishna Birthday:నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన తొడగొడితే సినిమా పక్కా 'పైసా వసూల్'. మీసం మెలేస్తే సినిమా బ్లాక్ బస్టర్. మేనరిజంలోనే కాదు డైలాగ్ డెలివరీలోనూ బాలకృష్ణ స్టైలే వేరు. 48 ఏళ్లకు పైగా కెరీర్లో ఆయన సాధించిన రికార్డులు అనేకం. సోమవారం (జూన్ 10)న ఆయన 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
- 'తాతమ్మ కల' సినిమాతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ ఇప్పటివరకు 108 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన 'NBK 109'లో నటిస్తున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. ఇక తండ్రి సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 10కిపైగా సినిమాల్లో కనిపించారు.
- తెరమీద తెర వెనుక శ్లోకాలు, పద్యాలను అవలీలగా చెప్పగల నటుడు బాలయ్య. ఇప్పుడున్న నటుల్లో పౌరాణిక, సాంఘికం, జానపదం, సైన్స్‌ఫిక్షన్ ఇన్ని జానర్లను టచ్ చేసిన హీరో బాలకృష్ణ. చెంఘీజ్‌ఖాన్, గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలనేది బాలయ్య కోరిక.
- 1987లో బాలకృష్ణ హీరోగా నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య అత్యధికంగా 13 చిత్రాల్లో నటించారు.
- 100+ సినిమాలు చేసిన బాలయ్య ఓ అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్లో అత్యధిక సినిమాల్లో డ్యుయల్ రోల్లో నటించిన రికార్డు బాలయ్య పేరిటే ఉంది. ఆయన కెరీర్లో ఇప్పటిదాకా 17 సినిమాల్లో ద్విపాత్రాభినయం పాత్ర పోషించారు. కాగా, 'అధినాయకుడు'లో త్రిపాత్రాభినయంగా కనిపించారు.
- బాలకృష్ణ టాలీవుడ్ తరఫున 43వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (గోవా) వేడుకకు చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు.
- బాలకృష్ణ ఆధ్యాత్మికంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులు. సింహా పేరు ఆయనకు బాగా సెంటిమెంట్. ఆయన హీరోగా సింహా పేరున్న సినిమాలు 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'లక్ష్మీనరసింహా', 'సింహా', 'వీరసింహారెడ్డి' బంపర్ హిట్ అయ్యాయి.
- నటనతోనే కాదు ఆయన గాయకుడిగానూ ఫ్యాన్స్‌ను అలరించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పైసా వసూల్' సినిమాలో 'మామా ఏక్ పెగ్ లా' పాటను పాడి అభిమానులను ఉర్రూతలూగించారు.
- బాలకృష్ణ భవిష్యత్‌లో దర్శకుడిగా మారనున్నారు. 'ఆదిత్య 999' కథతో తన కల నెరవేర్చుకోనున్నారు. గతంలో తాను నటించిన 'ఆదిత్య 369'ని తలపించే విధంగా స్టోరీ రెడీ చేశారంట. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
- హీరోగానే కాకుండా హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన హోస్ట్‌గా 'అన్‌స్టాపబుల్' షోతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఈ షో తో హోస్ట్‌గానూ సూపర్ హిట్ అయ్యారు.
- నటుడిగా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బాలయ్య, రాజకీయాల్లోనూ అదరగొట్టేస్తున్నారు. ప్రజాసేవ చేస్తూ పాలిటిక్స్‌లో రాణిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.