Saif Ali Khan Attack : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడు చివరిసారిగా బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించాడని పోలీసులు తెలిపారు. సైఫ్‌పై దాడి తర్వాత ఆ వ్యక్తి గురువారం ఉదయం లోకల్ ట్రైన్లో వాసాయి-విరార్ వైపు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వాసాయి, నల్లసోపారా, విరార్ ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ఆ వ్యక్తి దొరికాడు!
విచారణ కోసం శుక్రవారం ఉదయం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే ఆ వ్యక్తికి, సైఫ్ అలీఖాన్ దాడి కేసుతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ముంబయి పోలీసులు పేర్కొన్నారు.
హెక్సా బ్లేడ్ స్వాధీనం
మరోవైపు, సైఫ్ అలీఖాన్ వెన్నెముకలో ఇరుక్కున్న హెక్సా బ్లేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో సైఫ్ అలీఖాన్ ఇంటివద్ద పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించడానికి ముంబయిలోని అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించామని వెల్లడించారు. సైఫ్‌పై దాడి జరిగినప్పుడు ఆయన అపార్ట్మెంట్ సమీపంలో ఎన్ని మొబైల్ ఫోన్లు యాక్టివ్‌గా ఉన్నాయో వంటి విషయాలను క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సేకరించారని అన్నారు.