AR Rahman Mohini Dey Divorce : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ - సైరా బాను దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట డివోర్స్ ప్రకటించిన కాసేపటిలోనే రెహమాన్ టీమ్‌లోని 29 ఏళ్ల మోహినిదే అనే సభ్యురాలు కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపింది. అలా ఈ ఇద్దరూ ఒకే సారి నిర్ణయం ప్రకటించడంపై రకరకాల వార్తలు రావడం ప్రారంభం అయ్యాయి. ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ చర్చించుకోవడం ప్రారంభించారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది దీని గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై మోహినిదే స్పందించారు. ఆ రూమర్స్‌ను ఆమె ఖండించారు. తన గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.
"నేను డివోర్స్ గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంటర్వ్యూల కోసం చాలా మంది ఫోన్ చేస్తున్నారు. కానీ వారంతా నా ఇంటర్వ్యూలను ఎందుకు అడుగుతున్నారో తెలుసు. నేను ప్రతిఒక్కరి రిక్వెస్ట్‌ను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే వారు ఏం అనుకుంటున్నారో, దాని గురించి మాట్లాడడానికి అస్సలు ఆసక్తి లేదు. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృథా చేసుకోలేను. ప్లీజ్ నా గోప్యతను గౌరవించండి" అని మోహినిదే చెప్పుకొచ్చారు.