Mithun Chakraborty Health Condition:బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (73) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. బంగాల్ కోల్కతాలో శనివారం సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయన కిందపడ్డారు. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మిథున్ చక్రవర్తి శుక్రవారం రాత్రి నుంచే కాస్త అనారోగ్యంగా ఉన్నారట. శనివారం ఉదయం షూటింగ్లో పాల్గొన్నాక ఛాతిలో నొప్పితో కూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఐసీయూ (Intensive Care Unit)లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
నేషనల్ అవార్డు విజేత: మిథున్ చక్రవర్తి బంగాల్లో జన్మించినప్పటికీ బాలీవుడ్లోనే స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. 'డిస్కో డ్యాన్సర్'తో కెరీర్ ప్రారంభించిన ఆయన క్రమంగా బాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగారు. 80ల్లో అమితాబ్ బచ్చన్, రాకేశ్ ఖన్నాలాంటి స్టార్లు ఉన్న సమయంలో కూడా మిథున్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, పంజాబీలో వందకు పైగా సినిమాల్లో నటించారు.
1976లో 'తాహేదార్ కథ' చిత్రానికి, 1992వ సంవత్సరంలో 'స్వామి వివేకానంద' సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు పొందారు. ఇక ఐఫా, ఫిల్మ్ ఫేర్వంటి తదితర పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. రీసెంట్గా మిథున్ చక్రవర్తిని కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక విక్టరీ వెంకటేశ్, పవర్ స్టార్ పవన్ కల్యాన్ మల్టీస్టారర్ సినిమా 'గోపాల గోపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ తర్వాత ఆది పినిశెట్టి 'మలుపు' సినిమాలోనూ నటించారు. 2022లో సూపర్ హిట్ చిత్రం 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలో మిథున్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.