చిత్రం: వేట్టాయన్;
నటీనటులు: రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు;
సంగీతం: అనిరుధ్ రవిచందర్;
సినిమాటోగ్రఫీ:ఎస్.ఆర్.ఖదిర్;
స్క్రీన్‌ప్లే: బి.కిరుతిక;
నిర్మాత: సుభాస్కరన్;
రచన, దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్;
సంస్థ: లైకా ప్రొడక్షన్స్;
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన చిత్రం వేట్టాయన్. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్ నటించడంతో వేట్టాయన్‌పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? తెలుసుకుందాం.
Vettaiyan Story (కథేంటంటే) : నిజాయతీతో పాటు ధైర్యం ఎక్కువ ఉన్న అథియన్ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. న్యాయం కోసం చట్టాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుంటారు. అలాంటి అధికారికి శరణ్య (దుశారా విజయన్) అనే ఓ స్కూల్ టీచర్ హత్య కలచి వేయడం, ఆ తర్వాత ఆ హత్యకి పాల్పడిన నిందితుడు తప్పించుకోవడం, ఈ క్రమంలోనే ఆ నిందుతుడిని అథియాన్ మట్టుబెట్టడం జరుగుతుంది. మరి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేమిటి? మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఈ ఎన్‌కౌంటర్‌ను ఎందుకు తప్పు పట్టారు? అన్నదే ఈ చిత్ర కథ.
ఎలా ఉందంటే? - న్యాయం, విద్య సమానంగా అందాలనే ఓ బలమైన అంశాల్ని ఎంచుకుని వేట్టాయన్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు టీజీ జ్ఞానవేల్. సినిమా అంతా కేవలం ఓ హత్య కేసు చుట్టూనే సాగుతుంది. రజనీకాంత్ తన మార్క్ సన్నివేశాలతోనే ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మెల్లగా కథలోకి వెళ్లారు. శరణ్య హత్యతో కథలో వేగం పుంజుకుంటుంది. అథియాన్ ఎంట్రీతో సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. దూకుడు, ధైర్యం ఉన్న అథియన్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న నిందితుడిని కనిపెట్టే విధానం ఆకట్టుకుంది. నిందితుడి ఎన్‌కౌంటర్ తర్వాత వచ్చే మలుపు సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది.
సెకండాఫ్‌లో మానవ హక్కుల కోసం పోరాటం చేసే న్యాయమూర్తి సత్యదేవ్‌కు, ఎన్‌కౌంటర్ చేసిన అథియన్‌కీ మధ్య సంఘర్షణ ద్వితీయార్ధానికి కీలకంగా ఉంటుంది. ఫస్ట్ హాప్లో స్థాయిలో సెకండాఫ్ డ్రామా పండకపోయినప్పటికీ పర్వాలేదనిపిస్తుంది. పతాక సన్నివేశాలూ సాదాసీదాగానే సాగతాయి.
ఎవరెలా చేశారంటే ? - ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలో బానే నటించారు. గురిపెడితే ఎర పడాల్సిందే అంటూ ఆయన చేసిన హంగామా, ఆయన మార్క్ హావభావాలు కూడా బానే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. రజనీకాంత్, అమితాబ్ పాత్రల మధ్య సంఘర్షణ పర్వాలేదనిపిస్తుంది.
ఫహాద్ ఫాజిల్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. అక్కడక్కడా నవ్విస్తూనే కేసును ముందుకు నడిపించారు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా బాగుందనే చెప్పాలి. రానా దగ్గుబాటి కార్పొరేట్ శక్తిగా కనిపించారు. ఆయన ఆ పాత్రలో కనిపించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. రితికా సింగ్, దుషారా విజయన్, మంజు వారియర్ పాత్రలు కథలో కీలకం. టెక్నికల్‌గా మ్యాజిక్, కెమెరా విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. దర్శకుడి కథాలోచన కూడా బాగుంది. మాటల్లో బలం ఉంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
చివరిగా : వేట్టయన్ - రజనీ శ్వాగ్
గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'వేట్టయన్' తెలుగు టైటిల్ పెట్టకపోవడంపై కాంట్రవర్సీ - స్పందించిన నిర్మాణ సంస్థ
SSMB 29 షూటింగ్ ప్రారంభం అప్పుడే - అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్