Mahesh Babu Srimanthudu Movie : టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు లీడ్ రోల్లో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' మూవీ కాపీరైట్ సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కాంట్రవర్సీపై మూవీటీమ్ స్పందించింది. ప్రస్తుతం ఈ విషయంపై ఎవరూ ఎటువంటి అభిప్రాయాలకు రావొద్దంటూ విజ్ఞప్తి చేసింది.
" శ్రీమంతుడు, చచ్చేంత ప్రేమ ఈ రెండూ పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయి. వేటికవే విభిన్నం. పుస్తకం, సినిమాను పరిశీలించిన వారు ఈ వాస్తవాన్ని గుర్తించొచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం లీగల్ రివ్యూలో ఉంది. అందువల్ల ఈ విషంయపై అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మేము మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కాస్త ఓపిక పట్టండి. చట్టపరమైన ప్రక్రియపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అంటూ మూవీ టీమ్ పేర్కొంది. మరోవైపు ఈ వ్యవహారంపై తాజాగా రచయిత స్పందించారు. ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూలో ఆయన ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడారు.
"2012లో నేను రాసిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. ఆ స్టోరీతో ఓ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని డైరెక్టర్ సముద్రను కలిశాను. అయితే మేం ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనుకున్న సమయంలోనే కొరటాల శివ 'శ్రీమంతుడు' విడుదలైంది. అది చూసి మా స్నేహితులు అది నా కథేనన్నారు. దాంతో నేను కూడా ఆ సినిమాను చూశాను. అయితే నేను రాసిన స్టోరీలో ఉన్నట్లుగానే స్క్రీన్‌పై చూసి షాకయ్యను. ఆ తర్వాత డైరెక్టర్‌తో మాట్లాడాను. ఇది నా స్టోరీనే అని చెప్పాను. కానీ ఆయన దానికి అంగీకరించలేదు. సినీ పెద్దలు కొంతమంది కూడా ఈ వ్యవహారంలో రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. రూ.15 లక్షలు ఇస్తామని అన్నారు. అయితే ఈ విషయంలో నాకు రచయితల అసోసియేషన్ ఎంతో సాయం అందించింది. వాళ్ల సహకారంతోనే నేను కోర్టును ఆశ్రయించాను. ఈ స్క్రిప్ట్ నాదేనని అంగీకరించమని కోరుతున్నాను" అని శరత్ చంద్ర అన్నారు.