KGF 2 Raveena Tandon : సినిమా అనే రంగుల ప్రపంచంలో రాణించాలంటే అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడాలి. మనలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవాలంటే అవకాశం వచ్చేంత వరకు ఎదురుచూస్తుండాలి. అందం, అభినయం ఉండి నటించే ఛాన్స్ రాక వెనుదిగిరిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారసత్వాన్ని పక్కనపెడితే బయట నుంచి వచ్చే వాళ్లు తొలి సినిమా కోసం ఓ యుద్ధమే చేయాలి. ఇంకొంతమంది సినీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినప్పటికీ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కష్టాన్నే ఎదుర్కొని స్టార్ హీరోయిన్ ఎదిగానంటోంది రవీనా టాండన్. స్టూడియో ఫ్లోర్లను తుడిచే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది.
రవీనా టాండన్ ఫిల్మ్ మేకర్ రవి టాండన్, వీణా టాండన్‌ల కూతురు. ఇండస్ట్రీలో రాణించాలంటే వారసత్వం ఉంటే సరిపోదని రవిటాండన్ కెరీర్ మనకు గుర్తు చేస్తుంది. 1990లో రవీనా టాండన్ అంటే యువతకు ఎక్కడా లేని అభిమానం. ముఖ్యంగా అందం, అభినయంతో వారి గుండెల్లో గూడుకట్టుకుంది.అయితే ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు చాలా కష్టపడిందట. ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు సంఘటనల గురించి పంచుకుంది. "ఓ స్డూడియోలో నేను పనిచేస్తున్న సమయంలో ఫ్లోర్లను తుడవడం, స్టాల్స్, స్టూడియో ఫ్లోర్స్, వస్తువులతో పాటు వాంతులు చేసుకున్న చోట కూడా తుడిచాను. ప్రహ్లాద్ కక్కర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ సమయంలో కొంతమంది నువ్వు స్క్రీన్ ముందు ఉండాల్సిన దానివి అంటుంటే నాకు అంత సీన్ లేదని చెప్పేదాన్ని. అసలు నేను నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. అయితే ప్రహ్లాద్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎవరైనా మోడల్స్ రాని సమయంలో మేకప్ వేసుకుని నేను పోజులిచ్చేదాన్ని. అలా మోడలింగ్ మొదలుపెట్టడంతో నాకు సినిమా ఆఫర్లు వచ్చాయి " అని తెలిపింది.
సల్మాన్ ఖాన్‌తో మొదటి హిట్ : సల్మాన్ ఖాన్ సరసన పత్తర్ కే ఫూల్ మూవీలో రవీనా టాండన్ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్లను అందుకుంది. దీంతో రవీనాటాండన్కు ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమాతోనే రవీనా ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించాయి. అంతేకాదు రవీనా టాలీవుడ్ లోనూ నటించింది. తెలుగులో ఆమె తొలిచిత్రం బంగారు బుల్లోడు. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.