Keerthi suresh Raghu Thatha Movie Review : ఓవైపు భిన్నమైన కథలు, మరోవైపు కమర్షియల్ స్టోరీస్‌తో కెరీర్‌లో ముందుకెళ్తున్న కీర్తి సురేశ్ తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మధ్య థియేటర్లలో విడుదలైన రఘుతాత తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇది పొలిటికల్ కామెడీ మూవీగా తెరకెక్కింది. ప్రస్తుతం జీ 5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?
Raghu Thatha Movie Story : కయళ్ పాండియన్ (కీర్తి సురేశ్) మద్రాసు సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటుంది. కథలు కూడా రాస్తుంటుంది. ముఖ్యంగా మాతృ భాషా ప్రేమికురాలు. అలానే పెళ్లి వ్యతిరేకి కూడా. కానీ క్యాన్సర్ బారిన పడిన తన తాత రఘోత్తమన్ (ఎం.ఎస్. భాస్కర్) కోసం పెళ్లికి సిద్ధమవుతుంది. ఇంజినీర్ తమిళ్ సెల్వన్ (రవీంద్ర విజయ్)ను వివాహం చేసేకునేందుకు రెడీ అవుతుంది.
కానీ నిశ్చితార్థం తర్వాత సెల్వన్ వ్యక్తిత్వం గురించి ఓ షాకింగ్ విషయం పాండియన్‌కు తెలుస్తుంది. దీంతో పెళ్లి రద్దు చేసుకునేందుకు సిద్ధపడుతుంది. అందులో భాగంగా తన మనసు చంపుకొని హిందీ పరీక్ష రాస్తుంది. కెరీర్‌లో ఎదిగేందుకు, రాసిన ఆ పరీక్షకు, పెళ్లికి సంబంధమేంటి? ఆ పరీక్ష పాస్ అవ్వడానికి పాండియన్ పడిన కష్టాలు ఏంటి? హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన రఘోత్తమన్ తన మనవరాలే హిందీ పరీక్ష రాసిందని తెలుసుకుని ఏమయ్యాడు? అసలు సెల్వన్ గురించి పాండియన్ తెలుసుకున్న వాస్తవమేంటి? అనేదే ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే? - తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తెరకెక్కించారు. సందేశంతో పాటు నవ్వులు పంచే ప్రయత్నం చేశారు దర్శకుడు సుమన్ కుమార్. హీరోయిన్ పెళ్లి చుట్టూనే దాదాపుగా కథ అంతా సాగుతుంది. పాండియన్ పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. తాత పాత్ర కూడా హాస్యభరితంగానే ఉంటుంది. సెల్వన్- పాండియన్ లవ్‌ట్రాక్ ప్రేక్షకుల సహసానికి పరీక్ష పెడుతుంది. సెల్వన్ వ్యక్తిత్వం పాండియన్‌కు ఇంటర్వెల్లో తెలిసినప్పుడు సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.