Saif Ali Khan Attack :బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై గురువారం జరిగిన ఎటాక్ బీ టౌన్‌ను కుదిపేసింది. ఓ దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన సైఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఆయన సతీమణి కరీనా కపూర్ స్పందించారు. తమ కుటుంబానికి ఇది కఠినమైన రోజు అని, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
'మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కఠినమైన సమయంలో మద్దతుగా నిలిచినవారందరికి కృతజ్ఞతలు. మీడియా, ఫ్రీలాన్సర్లు కాస్త సంయమనం పాటించాలని, ఊహాజనిత కథనాలు, కవరేజీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మా పై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ, ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా' అని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
ఇదీ జరిగింది
కాగా, గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా, ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన ఆయనకు లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.