Kalki Characters List:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా- స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్ రూపొందిచారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్‌హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
రీసెంట్గా ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. సినిమా మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ అని రీసెంట్గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరు ఏయే పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ ఆ పాత్రలను ఏయే పౌరాణిక అంశాల ద్వారా డిజైన్ చేసుకుని ఉంటారు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం.
శివతత్వమే భైరవుడా?
ప్రభాస్ భైరవ అనే పేరుతో బౌంటీ హంటర్ పాత్రలో నటిస్తున్నారు. ఇది కూడా పురాణాల నుంచి తీసుకొని డిజైన్ చేసిన పాత్ర అనే అనిపిస్తోంది. అసలు భైరవ అంటేనే అందులో శివతత్వం ఉంది. అసలు భైరవుడు ఉద్భవించడానికి ఓ కథ ఉంది. పరమేశ్వరునికి తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అనే ఐదు ముఖాలు. అటు బ్రహ్మకి కూడా 5 ముఖాలు. ఒకనాడు ఋషులకి త్రిమూర్తులలో ఎవరూ అసలైన బ్రహ్మము అని సందేహం వస్తుంది, తీర్చమని వారినే అడుగుతారు. ఇంకెవరు నేనే బ్రహ్మము అంటాడు శివుడు. కాదు నేనే కదా తలరాతలు రాసేది కాబట్టి నేనే బ్రహ్మము అంటాడు బ్రహ్మ. నువ్వు నా నాభి నుంచి పుట్టావు అలాంటప్పుడు నేనే కదా బ్రహ్మము అని అంటాడు విష్ణువు.
అప్పుడు నిర్ణయం కోసం చతుర్వేదాలని, ప్రణవ నాదాన్ని పిలుస్తారు. అందరూ శివుడే పరబ్రహ్మం అని తేల్చి చెప్తారు. ఈ మాటలకు విష్ణుమూర్తి తన అంగీకారం చెప్తాడు. కానీ, బ్రహ్మ అందుకు ఒప్పుకోడు దాంతో. బ్రహ్మను శిక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది శివుడికి. అతని ఆగ్రహం లోంచి పుట్టిన భైరవుడు, బ్రహ్మ ఐదవ తలని గోటితో తుంచేస్తాడు. బ్రహ్మ అహంకారం దిగిపోతుంది. కానీ దీనివల్ల భైరవుడికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది దాని నుంచి విముక్తుడు కావడం కోసం ఎన్నో ప్రదేశాలు తిరుగుతాడు. 12 సంవత్సరాల పాటు చేతికి అంటుకున్న ఆ కపాలంలోనే తింటాడు. చివరికి కాశీలో అడుగుపెట్టిన క్షణమే అతని పాపం నశిస్తుంది. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తితో పూజించి తరించాడు. వెంటనే ప్రత్యక్షమైన కాశీ విశ్వనాథుడు భైరవుడిని ఆ క్షేత్రానికి పాలకుడిగా చేశాడు.
ఇక సినిమా విషయానికి వస్తే విడుదలైన ట్రైలర్, యానిమేషన్ సిరీస్ ప్రకారం భైరవకు కాశీ మొత్తం తెలుసు. కాశీలో ఉండే ప్రతి ఒక్కరికీ భైరవతో పరిచయం ఉన్నట్టు 'భైరవ అండ్ బుజ్జి' యానిమేషన్ సిరీస్‌లోనూ కనపడుతుంది. అశ్వత్థామలాంటి శక్తిమంతమైన వ్యక్తిని కూడా ఎదుర్కొనే బలమున్న పాత్రగా దాన్ని నాగ్ అశ్విన్ తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. త్వరలో పుట్టబోయే కల్కిని రక్షించే వ్యక్తిగా ఈ భైరవుడిని చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అశ్వత్థామ చేతిలో ఉన్నఓ ఆయుధం ఆ తర్వాత భైరవ చేతిలో కూడా ఉన్నట్లు పోస్టర్స్‌లో కనిపిస్తుంది.
అశ్వత్థామ
శ్రీమహా విష్ణువు స్వీకరించిన దశావతారాలలో చివరి అవతారం కల్కి. ఇక 2898 ఏడీలో అంటే కల్కి అవతరించడానికి ముందే ఈ కథ మొదలవుతుంది. అంటే బహుశా భారతంలో అశ్వత్థామ పాత్ర స్పూర్తి తో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న పాత్రను తయారు చేసుకొని ఉంటారు. భారతంలో అత్యంత శక్తిమంతమైన, ఆవేశం ఉన్న పాత్ర అశ్వత్థామ. పాండవులమీద కోపంతో రగిలిపోయిన అశ్వత్థామ ఉత్తర గర్భాన్ని నాశనం చేస్తాడు.
దీంతో చిరంజీవిగా చిరకాలం జీవించే అమరత్వం ఉన్నప్పటికీ కృష్ణుని శాపం వల్ల శరీరం అంతా మానని గాయాలతో కుష్టు రోగ్యంతో కొన్ని వేల ఏళ్ళు జీవిస్తాడు. నుదుటున మణితో పుట్టిన అశ్వత్థామకు ఆకలి దప్పికలు ఉండవు. మణి ప్రభావంతో ఏ ఆయుధము, దేవతలు, నాగులు కూడా నాశనం చేయలేవు. ఇక ఈ సినిమాలో 'కల్కి' అవతార ఆవిర్భావానికి అశ్వత్థామకు ఏంటి సంబంధం అనేది ఆసక్తిగా చూపించనున్నారు. ఎందుకంటే గర్భిణి అయిన దీపికా పదుకొణెను కాపాడటం కోసం అమితాబ్ ప్రయత్నిస్తున్నాడన్నది ఇప్పటికే ట్రైలర్లో కనిపించింది.