Kalki 2898 AD Amitabh Bachan : రంగుల ప్రపంచంలో కీర్తి, విజయాలు సాధించడం అనుకున్నంత సులువు కాదు. ఎంతో శ్రమ పడాలి. ఎన్నో సహించాలి. అంతలా కష్టపడ్డాక కూడా విజయం దక్కుతుందనే గ్యారంటీ ఉండదు. అదృష్టం కూడా కలిసిరావాలి. అలాంటి సినీ రంగంలో తన నటనతో చిత్రపరిశ్రమను ఏలి బాలీవుడ్‌లో సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి నటుడిగా నిలిచారాయన. బాలీవుడ్‌లో అగ్ర స్థానానికి చేరి అక్కడే తిష్ట వేసుకుని కూర్చొన్న ఆయన ఆ తర్వాత ఒక్కసారిగా పాతాళానికి కూడా పడిపోయారు! తన కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోయి అప్పులు తీర్చలేక దివాళ తీసే స్థితికి చేరుకున్నారు! అయినా ఆత్మ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఈ క్లిష్ట సమయాలే ఆయన్ను మరింత దృఢంగా మార్చాయి. దీంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, ధైర్యంగా ఎలా ముందుకు వెళ్లాలో తన జీవితం ద్వారా చాటి చెప్పారు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్.
ఆయన జీవితమే పాఠశాల(Amitabh Bachan Career) -కల్కి సినిమాలో అశ్వత్థామగా పోరాడినట్లే నిజ జీవితంలోనూ అమితాబ్ అద్భుతంగా పోరాటం చేస్తూ ముందుకెళ్లారు. 1969లో సాత్ హిందుస్థానీ చిత్రంతో అమితాబ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే కొన్నేళ్లపాటు అమితాబ్ బచ్చన్‌కు అసలు భారీ విజయమే దక్కలేదు. అయినా ఆయన అపజయాలకు భయపడలేదు. కృషి చేస్తూనే ఉన్నారు. అప్పటికీ ఆయన వయసు 30. అలా పోరాటం చేస్తూనే సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. అయినా 12 చిత్రాలు ఫ్లాప్. రెండే చిత్రాలు విజయవంతయ్యాయి. కానీ బిగ్‌బీ అలానే పట్టుదలతో ముందుకెళ్లారు. పరిస్థితులు భయపెడుతున్నా అడుగు ముందుకే వేశారు.
ఆ తర్వాత కాలం మారింది. బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా అమితాబ్ కీర్తి హిమాలయాల అంత ఎత్తుకు చేరింది. సినిమాల తర్వాత సినిమాలు, హిట్‌లు తర్వాత హిట్‌లు బిగ్‌బీ రేంజ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాయి. అయితే ఈ సినీ ప్రయాణంలో అఖండ జ్యోతిగా వెలిగిపోతున్న అమితాబ్‌కు 1990ల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. అమితాబ్ మరో పోరాటం చేయాల్సి వచ్చింది. 1990ల్లో అమితాబ్ బచ్చన్ స్థాపించిన AB కార్పొరేషన్ భారీ నష్టాలను చవిచూసింది. దీంతో బిగ్‌బీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. రుణదాతలకు రూ.90 కోట్లు బకాయిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై 55 లీగల్ కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో అప్పటివరకూ తనకు మిత్రులుగా ఉన్నవారే ఆ సమయంలో తనతో మాట్లాడేందుకు కూడా సంశయించారని అమితాబ్ ఓ ఇంటర్వ్యూలోనూ గుర్తు చేసుకున్నారు.
ధీరూభాయ్ సాయం -అంతటి క్లిష్ట సమయాల్లో ధీరూభాయ్ అంబానీ తనకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని బిగ్ బీ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ధీరూభాయ్ తన చిన్న కుమారుడు అనిల్ అంబానీకి చెక్ ఇచ్చి పంపారట. కానీ ఆ సాయాన్ని బిగ్‌బీ అంగీకరించలేకపోయారట.