Janhvi Kapoor Latest Interview :అందాల తార శ్రీ దేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఫ్యామిలీ మొత్తం సినీ నేపథ్యం నుంచే అయినా కూడా ఈ చిన్నది తన యాక్టింగ్, హార్డ్ వర్క్‌తో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ స్టార్, తాజాగా 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' అనే సినిమాతో అభిమానులను అలరించేందుకు వచ్చింది.
ఓ వ్యక్తి తన కలల్ని నిజం చేసుకోవడానికి తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరమో అనే నేపథ్యంలో సాగిన ఈ సినిమా మే 31న రిలీజైంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
"ఈ సినిమా కోసం నేను క్రికెట్లో శిక్షణ తీసుకున్నాను. అలా నా కోచ్‌లు నన్ను ఈ క్రీడకు ఫ్యాన్‌గా మార్చేశారు. ఇందులో క్రికెట్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేసే టైమ్‌లో నాకు ఎన్నోసార్లు గాయాలయ్యాయి. వాటిని తట్టుకోలేక కొన్నిసార్లు నేను ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నాను. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని, వాటన్నింటినీ అధిగమించి ప్రతి సీన్‌ను నేచురల్‌గా వచ్చేందుకు ఎంతో కష్టపడ్డాను. అంతే కాకుండా ఈ పాత్ర కోసం నేను మానసికంగా, శారీరకంగానూ ఎన్నో కసరత్తులు చేశాను. ఇప్పటివరకు నటించిన పాత్రలన్నింటి కన్నా, ఈ మహిమ పాత్రలో నేను రెండింతల ఉత్సాహాన్ని, అనుభూతిని పొందాను. మునుపెన్నడూ ఏ పాత్ర కోసం ఇలా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ నటించలేదు" అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.