IPL 2024 Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో పూనకాలు వచ్చేస్తాయి. అదీ ఆయన రేంజ్. ముక్కు సూటి మనిషి, మనసులో మాటను అస్సలు దాచుకోలేరు. ఏదైనా ఓపెన్‌గానే చెప్పేస్తారాయన. దాన్ని అర్థం చేసుకున్న వారు బాలయ్యది పసి మనసు అంటారు. చేసుకో లేని వారు కోపిష్టి అంటారు. అయితే సినిమాల్లో గంభీరంగా డైలాగ్‌లు చెప్పే ఆయన బయట మాత్రం స్టేజ్‌పై జోకులు కూడా వేస్తుంటారు. అయితే తాజాగా ఆయన ఐపీఎల్ స్టార్ క్రికెటర్స్‌ను ఉద్దేశిస్తూ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
త్వరలోనే ఐపీఎల్ సందడి ప్రారంభం కానుందన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ తొలి దఫా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రచార కార్యక్రమం మొదలెట్టింది. ఇందులో బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు. సీఎస్కే కెప్టెన్ ధోనీ, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ముంబయి మాజీ ప్లేయర్ రోహిత్ శర్మ ఆటతీరును, బిహేవియర్‌ను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగ్‌లు చెప్పుకొచ్చారు. వారి పేరు వినగానే గుర్తుకు వచ్చే డైలాగులు చెప్పండి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నలకు నటసింహం సమాధానం ఇచ్చారు. తన సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగులను వాళ్లకు అంకితం చేస్తూ సంభాషణలు చెప్పారు.
సీఎస్కే కెప్టెన్ ధోనీ అనగానే - "డు నాట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ది ట్రబుల్. ఐ యామ్ ది ట్రూత్" అని చెప్పారు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ ఫైర్ బ్రాండ్ అని చెప్పారు బాలయ్య. "నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్. తొక్కిపడేస్తా" అని కోహ్లీ గురించి అన్నారు. ఇక ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు వినగానే - "ఫ్లూట్ జింక ముందు ఊదు. సింహం ముందు కాదు" అని చెప్పుకొచ్చారు.