Hrithik Roshan Family Documentary :ఇటీవలే నయనతార డాక్యూమెంటరీతో నెట్‌ఫ్లిక్స్ పేరు నెట్టింట తెగ మార్మోగిపోగా, ఇప్పుడు మరో స్టార్ హీరో ఫ్యామిలీ గురించి ఇదే ఓటీటీ సంస్థ ఓ స్పెషల్ డాక్యుమెంటరీని రూపొందించనుంది. బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుటుంబం గురించి 'ది రోషన్స్' అనే పేరిట ఓ స్పెషల్ డాక్యుమెంటరీ రానున్నట్లు తెలిపింది.
"ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రోషన్ ఫ్యామిలీ ఎన్నో సేవలు చేసింది. ఆ కుటుంబంలోని మూడు తరాల వారి గురించి ఈ డాక్యుమెంటరీలో చూపనున్నాం. హృతిక్, ఆయన తండ్రి రాకేశ్ రోషన్, తాతయ్య రోషన్ సినీ పరిశ్రమకు అందించిన సేవల గురించి 'ది రోషన్స్'లో చూపించనున్నాం. హిందీ చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసి, మరుపురాని జ్ఞాపకాలను అందించింది ఈ కుటుంబం. వీరి ప్రయాణంలోని ఒడుదొడుకులు, అద్భుతాలను త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా చూడండి" అని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
2000లో హృతిక్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన తండ్రి రాకేశ్ రోషన్ డైరెక్షన్ల్లో తెరకెక్కిన 'కహో నా ప్యార్ హై' సినిమాతో సినీ తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే ఈ స్టార్ కిడ్ విజయాన్ని అందుకున్నారు. ఆ ఏడాది ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ఆ చిత్రం నిలిచింది. అంతేకాకుండా ఉత్తమ నటుడిగా పురస్కారాలను అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బీటౌన్ ప్రేక్షకులను అలరించారు. యాక్టింగ్‌లోనే కాకుండా డ్యాన్స్‌లోనూ దిట్ట అనిపించుకున్నారు.