Hit Pairs In Bollywood New Projects : ఆన్‌స్క్రీన్‌పై హీరోహీరోయిన్లు ఒక్కసారి హిట్ పెయిర్‌గా కనిపిస్తే చాలు ఇక వాళ్ల కాంబోలో మళ్లీ ఎప్పుడు సినిమా వస్తుందా అంటూ మూవీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆ పెయిర్‌కు పాపులారిటి ఉంటుంది. అలా బీటౌన్‌లో పేరు సంపాదించుకున్న కొన్ని జంటలు మరోసారి తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి వారెవరో ఓ సారి చూద్దామా ?
రణబీర్, ఆలియా : 'బ్రహ్మాస్త్ర' సినిమాలో రణబీర్ కపూర్, ఆలియా భట్ కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించారు. ఆ జంట అప్పటికే ప్రేమలో ఉండటం వల్ల ఈ సినిమాలో వారిద్దరి మధ్య మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇలా రీల్ తో పాటు రియల్ లైఫ్ లో హిట్ జోడి అయిన రణబీర్, ఆలియా మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. 'లవ్ అండ్ వార్' అనే చిత్రంలో కనిపించనున్నారు. సంజయ్ లీలా భన్సాలి రూపొందిస్తున్న ఈ సినిమాలో బీటౌన్ నటుడు విక్కీ కౌశల్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు.
మాధవన్, కంగనా : 'తను వెడ్స్ మను' - తక్కువ అంచనాలతో వచ్చి బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అందుకుంది ఈ చిత్రం. ఇందులో కంగనా రనౌత్, మాధవన్ తమ నేచురల్ యాక్టింగ్‌తో అభిమానులను ఆకర్షించారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్లోనూ ఈ జోడీ అదరగొట్టింది. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ ఒక సైకాలిజికల్ థ్రిల్లర్ లో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, విడుదలకు కొన్ని నెలల సమయం పడుతుందని అంటున్నారు మేకర్స్.