Hi Nanna Awards :నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్‌లో వచ్చిన 'హాయ్ నాన్న' మూవీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇంత వరకు పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిత్రం న్యూయార్క్‌లో జరిగిన 'ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్' ఈవెంట్లో పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. 'హాయ్ డాడీ' అనే పేరుతో ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
బెస్ట్ మూవీ, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ పెయిర్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ ట్రాక్, బెస్ట్ ఎడిటింగ్‌ల్స్ ఇలా మొత్తం 11 విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.
ఇక ఈ అవార్డులను గెలుచుకున్న విషయంపై డైరెక్టర్ శౌర్యువ్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. "ఇంత ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. హయ్ నాన్న కోసం మేమంతా పడిన కష్టానికి ఫలితమిది. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. స్టార్స్, సిబ్బంది సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యమైంది" అని శౌర్యువ్ అన్నారు.