Jyothika Review On Kanguva :కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'కంగువా'. డైరెక్టర్ శివ ఈ సినిమా తెరకెక్కించారు. నవంబర్ 14న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే దీనికి కొన్ని నెగెటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో సూర్య భార్య జ్యోతిక 'కంగువా'పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాకు నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అలాగే ఈమె కూడా ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. సూర్య భార్యగా కాకుండా ఒక మూవీ లవర్‌గా తాను ఈ రివ్యూ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
'కంగువా' ఓ అద్భుతమైన సినిమా. ఇందులో సూర్య నటన పట్ల నేను గర్వంగా ఉన్నా. అవును, ఫస్ట్ 30 నిమిషాలు అనుకున్న స్థాయిలో లేదు. అలాగే సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే చాలా సినిమాల్లో ఇలాంటి లోపాలు ఉంటాయి. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాల్లో అలాంటి చిన్నచిన్న లోపాలు ఉండటంలో తప్పేం లేదు. 3గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే సరిగ్గా లేదు కదా. నిజం చెబుతున్నా ఇదొక అద్భుత సినిమాటిక్ అనుభూతిని అందించింది. ఆయన సినిమాల్లో ఇలాంటి కెమెరా వర్క్ ఇప్పటిదాకా నేను చూడలేదు'
'ఈ సినిమాకు వస్తున్న నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయా. గతంలో భారీ బడ్జెట్ చిత్రాల్లో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా, ఆయా చోట్లు సీన్స్ బాగోకపోయినప్పటికీ ఇలాంటి రివ్యూలు మాత్రం చూడలేదు. భారీ యాక్షన్ సీన్స్, సెకండాఫ్‌లో మహిళలపై చిత్రీకరించిన ఫైట్ సీన్స్, కంగువాపై చిన్నారి ప్రేమ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అయితే రివ్యూ రాసేటప్పుడు సినిమాలోని పాజిటివ్స్ మరిచిపోయారనుకుంటా. రీలీజ్ రోజు నుంచే ఇంత నెగెటివిటీ చూడటం బాధగా ఉంది. ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూపించేందుకు చేసిన ప్రయత్నానికి ప్రశంసలు దక్కాలి' అని జ్యోతిక పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.55+ కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.