అమెరికాలో నవీన్ పోలిశెట్టికి రోడ్డు ప్రమాదం - పరిస్థితి ఎలా ఉందంటే? - Hero Naveen polishetty - HERO NAVEEN POLISHETTY
Hero Naveen Polishetty Bike Accident : అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో జాయిన్ చేశారట. ఆ వివరాలు.
Published : Mar 28, 2024, 11:48 AM IST
|Updated : Mar 28, 2024, 12:42 PM IST
Hero Naveen Polishetty Bike Accident :టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. అయితే ఇది జరిగి రెండు రోజులు అయిందని, పోలిశెట్టి తన సన్నిహితులకు ఈ విషయాన్ని తెలిజేయడంతో విషయం బయటకు వచ్చిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. నవీన్ బైక్ నడుపుతుండగా జారిపడి చేతికి గాయం అయిందని, ఫ్రాక్చర్ కావడం వల్ల రెండు నెలలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై టాలీవుడ్ ఇండస్ట్రిలో ఎవరికీ క్లారిటీ లేదు. నవీన్ తిరిగి ఇండియాకు వచ్చాక లేదా అతని సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తే కానీ ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు.
ఇకపోతే నవీన్ కెరీర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. జాతి రత్నాలు సూపర్ హిట్ కావడంతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి కూడా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఆయన తర్వాతి సినిమాల మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి తర్వాత ఒప్పుకున్న చిత్రాలు ఇంకా చర్చల్లోనే ఉన్నాయి. గతంలో అనౌన్స్ చేసిన అనగనగా ఒక రోజు సినిమా గురించి అప్డేట్స్ కూడా ఏమి లేవు. అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చాక మొదలు కావాల్సిన కొత్త సినిమా షూటింగ్స్ ఇప్పుడు నవీన్ గాయంతో మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో ఒప్పుకున్న సినిమా కథ ఫైనల్ అయినా డైరెక్టర్‌తో ఏదో సమస్య కారణంగా ఆ మూవీ షూటింగ్ మొదలు కాలేదు. అయితే మరో కొత్త డైరెక్టర్‌ను ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా షైన్ స్క్రీన్స్ సంస్థతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.
నవీన్‌కు టాలీవుడ్లోనే కాదు, కొన్ని వైరల్ వీడియోలతో హిందీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదట ఆ వీడియోలలో చూసి చాలా మంది అతను హిందీ కుర్రాడు అనే అనుకునేవారు. ఆ తర్వాత అతను 2012లో నటించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో నెగటివ్ రోల్ చేసినట్లు గుర్తుపట్టారు. ఆ వైరల్ వీడియోల తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో పాటు హిందీలో చేసిన చిచ్చోరే సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.