Happy Birthday Ram Charan Chiranjeevi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సిమిమాల్లోకి వచ్చి దాదాపు 17 ఏళ్లు అవుతుంది. 2007లో చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయిన చరణ్ ఆ తర్వాత మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150కి ప్రొడ్యూసర్‌గా కూడా మారారు. తండ్రి మెగాస్టార్ అయినా రామ్ చరణ్ సినిమాల్లోకి రాక ముందు మీడియా ముందు ఎక్కువగా కనపడలేదు. అడపాదడపా మాత్రమే కనిపించేవారు. చిరు చేసిన కొన్ని సినిమాల ఆడియో ఫంక్షన్లలో మాత్రమే కనిపించేవారు.
సాధారణంగా ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పుడు చాలా మందికి వాటి మీద ధ్యాస, ఆసక్తి ఉంటాయి. కానీ రామ్ చరణ్‌కు చిన్నప్పుడు సినిమాల మీద అంతగా ధ్యాస ఉండేది కాదట. చిరంజీవి నటించిన సినిమా షూటింగ్‌లకు కూడా చరణ్ వెళ్లలేదట. కేవలం చిరు నటించిన రాజా విక్రమార్క, లంకేశ్వరుడు, ఆపద్భాంధవుడు షూటింగ్స్‌కు మాత్రమే వెళ్లారట.
ఇంకా చెప్పాలంటే మెగా ఫ్యామిలీది అంత పెద్ద సినీ కుటుంబం అయినా కూడా ఇంట్లో ఏ సినిమా పోస్టర్లు ఉండేవి కావు. సినిమా మ్యాగజైన్స్, సినిమా అవార్డులు కూడా తన ఆఫీస్‌లోనే చిరంజీవి ఉంచేవారట. అయితే 8వ తరగతి చదివేటప్పుడు రామ్ చరణ్ ఆఫీస్‌లో ఉండే సినిమా మ్యాగజైన్స్‌లో ఏముంటుందో చూడాలనే కుతూహలంతో వాటిని తెరిచారట. అది తెరవగానే హఠాత్తుగా చిరంజీవి గదిలోకి వచ్చారట. అంతే చరణ్ తండ్రిని చూసి వణికిపోయారట. ఇక ఆ రోజు ఇంట్లో ఈ విషయం మీద పెద్ద చర్చ జరిగిందట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో చరణ్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత కొంచెం పెద్ద అయ్యి పదో తరగతి పూర్తి అయ్యాక చరణ్‌కు సినిమా విషయంలో కొంచెం స్వేచ్చను ఇచ్చారట చిరంజీవి.