Happy Birthday Allu Arjun :ఇంటి నిండా సినిమా వాతావరణమే అయినా ఆయనలోని వైవిధ్యం, అభిమానులకు ఎప్పుడూ కొత్తగా కనపడాలనే కుతూహలం ఐకాన్ స్టార్‌గా మలిచింది. "ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయిని ఇవ్వలేం" అనేది అల్లు అర్జున్ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి ప్రొడ్యూసర్‌గా సినిమాలు రూపొందించి స్థానం కల్పించినా స్థాయిని సంపాదించుకొన్నది మాత్రం అల్లు అర్జునే. గంగోత్రి సినిమా నుంచి ఐకాన్ స్టార్‌గా ఎదిగిన తీరు బన్నీ గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అయితే ఆయన జీవితంలో మర్చిపోలేని ఓ సంఘటన దాగి ఉందట. ఇంకా అలానే తన జీవితాన్ని మలుపు తిప్పిన ఓ సంఘటన కూడా ఉందని చెప్పారు బన్నీ. నేడు(ఏప్రిల్ 8) ఆయన పుట్టినరోజు సందర్భంగా అదేంటో తెలుసుకుందాం.
ఆమె కోపాన్ని కళ్లలో -ఒక రెస్టారెంట్‌లో తన ఫ్రెండ్‌తో కలిసి ఉన్న సమయంలో ఆమెతో మనస్పర్థలు వచ్చాయట బన్నీకి. అప్పుడు ఆమె అక్కడి నుంచి కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నించదట. అయితే తనను ఆపే క్రమంలో బన్నీ కూడా కారు వేగంగా నడపారట. అప్పుడు ముందు ఉన్న కారును గుద్దేశారు అల్లు అర్జున్. వెంటనే దిగి కారులో వారికి ఏమీ కాలేదని తెలిసిన తర్వాతే కుదుటపడ్డానని, కాకపోతే తనను ఏమీ అనకపోయినా ఆ కారులో ఉన్న గర్భిణీ చూసిన చూపు ఇప్పటికీ తనకు గుర్తుండిపోయిందని చెప్తుంటారు బన్నీ. ఆమె కళ్లలో ఉన్న కోపాన్ని ఇప్పటికీ మర్చిపోలేని అంటుంటారు. అప్పటి నుంచి డ్రైవింగ్ కేర్ ఫుల్‌గా చేయడం మొదలుపెట్టారట.
బన్నీ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన - సినిమా అంటే ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చూపించాలనుకునే బన్నీ ఇంకా ఏదో చేయాలనే తపనతోనే కనిపిస్తుంటారని, ఆయనతో పనిచేసిన టెక్నిషియన్స్ చెబుతుంటారు. బన్నీ కూడా అదే చెప్పారు. "కెరీర్ స్టార్టింగ్‌లో సినిమాలు అడపాదడపా చేసేసేవాడ్ని. కానీ, దేశముదురు సినిమా షూటింగ్ లో భుజానికి గాయమై మైనర్ సర్జరీ జరిగింది. బద్రీనాథ్ సమయంలో అదే చోటు మరో పెద్ద దెబ్బ తగలడంతో మేజర్ ఆపరేషన్ చేసి, ఏడెనిమిది నెలలు షూటింగులకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలన్నారు. అప్పటికీ జులాయి సినిమా పాటలు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పుడు రియలైజ్ అయ్యాను. జీవితం చాలా చిన్నది నటిస్తున్నామా డబ్బులు వచ్చాయా అని కాకుండా గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఫిక్సయిపోయానని" అని అల్లు అర్జున్ ఓ సందర్భంలో ఈ గాయం సంఘటనను తన జీవితాన్నే మలుపు తిప్పిందని చెప్పుకొచ్చారు. పాత్రలకు ఎంచుకునే తన ఆలోచన దృక్ఫథాన్ని మార్చాయని అన్నారు. కాగా, కెరీర్ అంటే కష్టాలను తట్టుకోవడమే కాదని, స్టార్‌డమ్ కరెక్ట్‌గా మేనేజ్ చేయడమని చెప్తుంటారు బన్నీ. హిట్ వస్తే పార్టీ చేసుకుంటూ కూర్చోకూడదని, దాన్ని స్ప్రింగ్ బోర్డులా మలచుకుని పైకి వెళ్లాలని సూచిస్తుంటారు.