Game Changer AP Local Tv :సంక్రాంతి కానుకగా విడుదలైనరామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ప్రస్తుతం థియేటర్లలో మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజై వారం రోజలు కూడా అవ్వకుండానే పైరసీ బారిన పడి ఓ లోకల్ టీవీ ఛానల్లో ప్రసారమైంది. తాజాగా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేయగా, టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ (ఎస్కేఎన్) స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"తాజాగా జరిగిన ఈ ఘటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దాదాపు 5 రోజుల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను లోకల్ ఛానల్స్‌లో అలాగే బస్సుల్లో ప్రసారం చేస్తున్నారు. ఇది నన్ను ఎంతో ఆందోళన కలిగించింది. ఒక సినిమా అంటే కేవలం హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్సే కాదు 4 సంవత్సరాల కృషి కూడా. వేలాది మంది కలల ఫలితం ఇందులో ఉంటుంది. అటువంటి దాన్ని ఇలా లీక్ చేసే ముందు సినిమా సక్సెస్‌పై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి కూడా ఓ సారి ఆలోచించండి. ఇటువంటి పనులు వల్ల ఇండస్ట్రీ ఫ్యూచర్‌కు కూడా ముప్పు కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. సినిమాను కాపాడటానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి పని చేద్దాం" అని ఎస్కేఎన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో పాటు ఆయన #SaveTheCinema అనే హ్యాష్ ట్యాగ్‌నూ ఆ పోస్ట్‌కు జోడించారు.