Pushpa 2 Fahad faasil : వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకుల్లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో ఫహద్ ఫాజిల్. ఈ మలయాళ సూపర్ యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప : ది రైజ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి భాగంలో భన్వర్‌సింగ్ షెకావత్‌గా నటించి మెప్పించారాయన. ప్రస్తుతం పుష్ప2లోనూ చేస్తున్నారు. ఓ వైపు ఈ సినిమాలో నటిస్తూనే మరోవైపు ఇతర చిత్రాల్లో హీరోగా రాణిస్తూ వరుస సక్సెస్‌లను అందుకుంటున్నారు. రీసెంట్‌గానే ఆవేశం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
ముఖ్యంగా పుష్పరాజ్ - భన్వర్‌సింగ్‌ల మధ్య భారీగా నువ్వా నేనా అంటూ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయంటూ వస్తున్న ప్రచారంపై స్పందించారు ఫహద్. అలాగే పుష్ప 2 తర్వాత దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోయే విలన్ ఆయనేనంటూ వస్తున్న ఊహాగానాలపై కూడా మాట్లాడారు. తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
"దేనికైనా డబ్బు ఉండాలనేది ఒక రీజన్. అంతే కానీ అదొక్కటే కాదు కదా! నేను బయటకొచ్చి చేసే పనేదైనా నాలో ఉత్సాహం నింపేలా ఉండాలి. సుకుమార్‌తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. భన్వర్‌సింగ్ పాత్రకు ఎవరు సెట్ అవుతారో ఆయనకు బాగా తెలుసు. అందుకే నేను ఈ సినిమాలో ఉన్నాను. మేమంతా కలిసి ఓ భారీ కమర్షియల్ సినిమా చేస్తున్నాం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకునే సెట్‌కు వెళ్తాను. పుష్ప టీమ్‌తో కలిసి వర్క్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చాలా ఆస్వాదిస్తాను. కానీ, దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే విలన్ అవుతానో, లేదో మాత్రం చెప్పలేను. కేవలం డబ్బుల కోసమే చిత్రాలు చేయడం లేదు. కుంబలంగి నైట్స్, ట్రాన్స్ సినిమాలతో బాగానే సంపాదించాను. యాక్టింగ్ ద్వారానే డబ్బులు సంపాదించాలని అనుకోవట్లేదు. ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చాను. ఈ సినిమా అనే అనిశ్చితి ఉన్న వ్యాపారం అనేది నా భావన. కేవలం రెండు చిత్రాలు చేసి వెళ్లిపోవాలనుకున్నాను. కానీ ఆ తర్వాత చేసినవన్నీ బోనసే" అని ఫహద్ పేర్కొన్నారు.