Vijay Devarakonda Elephant :రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ షూటింగ్కు పెద్ద కష్టమే వచ్చింది. ప్రస్తుతం విజయ్ తన 12వ (VD 12) సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లారు. ఈ షెడ్యూల్లో భాగంగా షూటింగ్ కోసం ఏనుగులను తీసుకువచ్చారు. ఏనుగులతో సీన్ షూట్ చేయాల్సి ఉంది. అయితే అందులో పుత్తుప్పల్లి సాధు అనే ఒక ఏనుగు అడవిలోకి పారిపోయిందట. షూటింగ్ కోసం తెచ్చిన రెండు ఏనుగుల మధ్య జరిగిన ఘర్షణ షూటింగ్ స్పాట్‌లో అలజడి రేగింది. ఆ తర్వాత కొద్దిపాటి గాయాలకు గురైన సాధు అనే ఏనుగు అడవిలోకి వెళ్లిపోయిందట.
ఏనుగులు పరస్పరం దాడి చేసుకోవడం గమనించిన షూటింగ్ సిబ్బందితో పాటు స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యామని చెబుతున్నారు. 57 సంవత్సరాల సాధు అనే ఏనుగు పారిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత దాని ఆరోగ్యం, ఆచూకీ గురించి తెలుసుకునేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలు మరుసటి రోజు ఉదయానికి ఫలించాయి. తప్పిపోయిన 57 సంవత్సరాల ఏనుగు కోసం శుక్రవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా శనివారం ఉదయం ఆచూకీ కనుగొన్నారు. ప్రస్తుతం సాధు ఆరోగ్యం నిలకడగానే ఉందని ఫారెస్ట్ గార్డ్స్ వెల్లడించారు.
'ఈ సినిమా షూటింగ్ కోసం మూడు ఆడ ఏనుగులను, రెండు మగ ఏనుగులను మొత్తం ఐదు ఏనుగులను తీసుకొచ్చారు. సాయంత్రం 5గంటల సమయంలో వాటి గొలుసులను తొలగించి రోడ్ దాటుతున్న సీన్ షూట్ చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే మణికందన్ అనే ఏనుగు సాధు అనే ఏనుగుపై దాడి చేసింది. అలా భయపడిపోయిన సాధు కొద్దిపాటి గాయాలతో అడవిలోకి, దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకూ పరుగుతీసింది. అంతేకాకుండా సాధుకు నీళ్లలో నుంచి వెళ్లగల ప్రత్యేక నైపుణ్యముండటంతో ఆచూకీ కనిపెట్టడం ఆలస్యమైంది. రాత్రి 10 నుంచి వెతకగా, శనివారం ఉదయం ఆచూకీ తెలుసుకోగలిగాం' అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.