Chiranjeevi Viswambara Shoot break :మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ చిత్రం కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. యాక్షన్ సీన్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. రీసెంట్గా ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో చిరంజీవి, త్రిష సహా ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు చిరు సినిమా నుంచి కాస్త విరామం తీసుకున్నారు. కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తున్నట్లు చెప్పారు. తిరిగి రాగానే షూటింగ్‌లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.నా భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్తున్నా. నేను అక్కడి నుంచి తిరిగిరాగానే ‘విశ్వంభర’ చిత్రీకరణలో పాల్గొంటా. అందరికీ వాలంటైన్‌డే శుభాకాంక్షలు. ప్రేమతో. అంటూ ట్వీట్ చేశారు.
Ramcharan RC16 movie biopic :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో కలసి ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ చిత్రం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవితం ఆధారంగా రూపొందించనున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇవన్నీ అవాస్తవాలు. ఈ చిత్రం ఎవరి బయోపిక్ కాదు. పల్లెటూరు నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇకపోతే ఈ వేసవిలో సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఇందులో ఓ కీలక పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.