తెలంగాణ

telangana

చిరు, చెర్రీ మంచి మనసు- వయనాడ్ బాధితులకు రూ. కోటి విరాళం - Wayanad Landslide Chiranjeevi

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 3:57 PM IST

కేరళలోని వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముందుకొచ్చారు. ఇద్దరూ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి విరాళం ప్రకటించారు.

Kerala Landslide Chiranjeevi Donation
Chiranjeevi Ram Charan (ETV Bharat)

Kerala Landslide Chiranjeevi Donation :కేరళలోని వయనాడ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులు కోసం మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ సంయుక్తంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్​కు ఈ సాయాన్ని అందించారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చిరంజీవి, రామ్ చరణ్​పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

"ప్రకృతి ప్రకోపం వల్ల కేరళలో జరిగిన విధ్వంసంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాను. వయనాడ్ దుర్ఘటన నా హృదయాన్ని కలిచివేసింది. అందుకే కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు చరణ్‌, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

సినీ ఇండస్ట్రీపై వయనాడ్ ఎఫెక్ట్
వయనాడ్ లో ప్రకృతి ప్రకోపం దెబ్బ మలయాళ సినీ ఇండస్ట్రీపై కూడా పడిందని ట్రేడ్ వర్గాల మాట. ఫుటేజ్, అడియోస్ అమిగో వంటి సినిమా రిలీజ్​లు వాయిదా పడ్డాయి. అయితే పలు సినిమాల విడుదల నిరవధికంగా వాయిదా పడడం వల్ల మలయాళ ఇండస్ట్రీకి రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.

రూ.10-15 కోట్ల వరకు మాలీవుడ్ నష్టపోయిందని ఈటీవీ భారత్ కు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడు సురేశ్ షెనాయ్ తెలిపారు. గత ఆరు నెలల్లో మలయాళ సినిమా వ్యాపారం సుమారు రూ. 1000 కోట్లకు చేరుకుందని చెప్పారు. అయితే గత రెండు వారాలుగా కేరళలో విడుదలైన సినిమా కలెక్షన్లు భారీగా తగ్గాయని వెల్లడించారు. థియేటర్ల పరిస్థితి 2018 వరదల సమయంలోలా ఇప్పుడు కూడా ఉందని అభిప్రాయపడ్డారు.

అండగా నిలిచిన ప్రముఖులు
వయనాడ్ బాధితులకు అండగా నిలిచేందుకు మలయాళ, తమిళ, తెలుగు ఇండస్ట్రీ హీరోలు ముందుకొచ్చారు. మోహన్​లాల్ రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అలాగే మమ్ముట్టి, విక్రమ్, రష్మిక మందన్న, సూర్య, కార్తీ, జ్యోతిక, కమల్ హాసన్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నయనతార, విఘ్నేశ్ శివన్​ వంటి ప్రముఖ నటులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్​కు భారీ విరాళాలు అందజేశారు.

334 మంది బలి
మరోవైపు కొండచరియలు విరిగిపడిన మండక్కై, చూరల్‌ మలా ప్రాంతాల్లో ఆరో రోజూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్​​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్​​, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300లకు పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. ఇంకా చాలా వరకు ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నట్టు వయనాడ్ జిల్లా కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. మట్టి, శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.

కొండచరియల ఘటనలో ఇప్పటి వరకు 334 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 215 మృతదేహాలు, 143 శరీర భాగాలను వెలికి తీసినట్టు పేర్కొంది. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులున్నట్టు తెలిపింది. మరోవైపు, వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ గోపీ పర్యటించారు. అధికారులను అడిగి సహాయక చర్యలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details