Chiranjeevi Birthday Special :కొణిదెల శివశంకర్ వరప్రసాద్ ఈ పేరు మీరు అంతగా వినకపోయుండచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే సౌత్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతుంది. తన నటనతో, అలాగే మేనరిజంతో అప్పటి ఇప్పటి యూత్‌ను తెగ ఆకట్టుకున్నారు. ఆరు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. రేపు (ఆగస్టు 22) ఆయన 69వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో సాధించిన రికార్డులను ఓ సారి చూద్దాం.
- ఇప్పటి పాన్ ఇండియా ట్రెండ్‌లోనే కాదు 90స్లోనూ అంతర్జాతీయంగా చిరుకు మంచి ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి నటించిన 'స్వయంకృషి' మూవీ రష్యన్‌లోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రంగా పేరొందింది.
- ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' అవార్డుల వేడుక (1987)లో ముఖ్య అతిథుల్లో ఒకరిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ స్టార్ కూడా చిరంజీవి కావడం విశేషం.
- నటనతోనే కాదు డ్యాన్స్‌తోనూ చిరు అబ్బురపరుస్తుంటారు. క్లిష్టమైన స్టెప్స్‌ను సైతం అవలీలగా వేయడంలో ఆయన స్పెషలిస్ట్. 'పసివాడి ప్రాణం' సినిమాతో బ్రేక్ డ్యాన్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు చిరు.
- ఏక పాత్రాభినయం, ద్విపాత్రాభినయం అలాగే త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు 100 రోజులు ఆడిన రికార్డు కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి పేరిట ఉంది.
- 'బావగారు బాగున్నారా' చిత్రం కోసం చిరు ఓ సాహసం చేశారు. ఈ చిత్రంలోని ఓ సీన్ కోసం సుమారు 240 అడుగుల ఎత్తునుంచి బంగీజంప్ చేశారు.
- 1980, 1983 ఈ ఏడాదుల్లో చిరు నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి.
- 1999- 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా చిరు పేరొందారు. ఆయన్ను ప్రభుత్వం 'సమ్మాన్' అనే అవార్డుతో సత్కరించింది. 2002లోని అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకు ఈ అవార్డును అందజేశారు.
- సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్(రూ.కోటికి పైగా) అందుకున్న తొలి భారతీయ నటుడిగా చిరు రికార్డుకెక్కారు. 1992లోనే ఆయన ఈ విషయమై వార్తల్లో నిలిచారు.
- చిరు మాస్ అవతారంలో నటించి మెప్పించిన 'ఘరానా మొగుడు' రూ. 10 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఘనత సాధించగా, ఆ తర్వాత వచ్చిన 'ఇంద్ర' రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కాయి.
- వ్యక్తిగతంగా వెబ్‌సైట్ కలిగిన తొలి భారతీయ నటుడు చిరంజీవి. ఆయన గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే https://www.kchiranjeevi.com/ అనే సైట్ అందుబాటులో ఉంది.