Balakrishna NBK 109 Title Teaser : నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్‌గా అలరించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి తమన్, దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ హాజరై సందడి చేశారు.
టీజర్లో బాలయ్య ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ మహారాజుది, కండ్రగొడ్డలి పట్టిన యమధర్మ రాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ బాలయ్యను ఎలివేట్ చేసి తీరు, ఆయన గుర్రపు స్వారీ చేస్తూ బందిపోటు లుక్‌లో కనిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది.
అయితే ఈ టైటిల్ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ప్రచార చిత్రంలో బాలయ్య చేసిన గుర్రపు స్వారీ గురించి మాట్లాడారు. బాలయ్య ఎలాంటి డూప్ లేకుండా స్టంట్స్ చేసినట్లు వివరించారు. " ఎలా ఉంది, రీసౌండ్ ఉందా? కండ్రగొడ్డలి పట్టిన యమధర్మ రాజు ఎట్లున్నాడు. టీజర్లో చూపించిన దాంట్లో డూప్‌లు లేవు, డూప్లికేట్లు లేవు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే. యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. అన్నీ ఒరిజినల్ షాట్స్. మీరు చాలా కాలం నుంచి సహనంగా ఉన్నందుకు థ్యాంక్స్. ఎప్పుడూ చూడని బాలయ్యను చూపిస్తున్నాం. ఆయనకు కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, అందరినీ దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇది పక్కా మాస్ సినిమా ఇది. సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. తమన్ అదిరే సంగీతం అందించారు. ఈ మ్యూజిక్ చూసినప్పుడు, స్పీకర్స్ ఓనర్స్ నా మీద, తమన్ మీద కేసు వేస్తారేమో అనిపించింది. అందరి కన్నా ముఖ్యంగా బాలకృష్ణ గారికి ప్రత్యేక థ్యాంక్స్. యుద్ధం ఎలా ఉంటుందో థియేటర్లో చూస్తారు" అని దర్శకుడు బాబీ చెప్పుకొచ్చారు.